Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు మోడీ ప్రభుత్వం చేతిలో ఆయుధాలుగా మారడం ఆందోళనకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో బుధవారం సీపీఐ మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ శంకర్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సీబీఐ, ఐటీ, ఈడీలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను అంతం చేసేందుకు కుట్రపూరిత ఆలోచనల్లో ప్రధాని మోదీ నిమగమై పనిచేయడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. బడా కార్పొరేట్ సంస్థల లక్షల కోట్ల మోసాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఆ పార్టీ నేతల అవినీతి వంటి కుంభకోణాల మీద మోడీ ప్రభుత్వం ఎందుకు సీబీఐ, ఈడీ, ఐటీలతో దర్యాప్తు జరపడం లేదని ప్రశ్నించారు. ప్రజాసమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి, భూమిలేని నిరుపేదలకు భూదాన భూముల పంపిణీ, ఖాళీ పోస్టుల భర్తీ కోసం సమరశీల పోరాటాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్, మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి డిజి సాయిలూగౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి, వెంకట్రెడ్డి, జె లక్ష్మి, శంకర్, ధర్మేంద్ర, హరినాథ్రావు, దశరథ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.