Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు నిందితుల సిట్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు నేడే
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలోనే సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరు కావాలంటూ మరో ఇద్దరికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడైన నందకుమార్ భార్య చిత్రలేఖతో పాటు అంబర్‌పేటకు చెందిన మరో లాయర్ ప్రతాప్‌గౌడ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విచారణ కోసం తమ ఎదుట హాజరు కావాలని వీరిద్దరికీ దర్యాప్తు అధికారులు నోటీసులిచ్చినట్టు తెలిసింది. ఇదిలాఉంటే, ఈ కేసులో నిందితులైన రామచంద్రభారతి, సింహయాజి స్వామి, నందకుమార్‌లను ఐదురోజుల పాటు సిట్ కస్టడీకి ఇచ్చే విషయమై తన తీర్పును ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు గురువారం (నేడు) ఇవ్వనున్నది. వీరిని కస్టడీకి ఇచ్చే విషయమై బుధవారం ఏసీబీ కోర్టులో నిందితుల తరఫు న్యాయవాదితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధ్య వాదోపవాదాలు సాగాయి. వీరి వాదనలను ఆలకించి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును గురువారానికి రిజర్వ్ చేశారు.