Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్అండ్టీ మెట్రోరైలు ప్రాజెక్టు సెస్‌పై ప్రభుత్వం సీరియస్
- జేసీఎల్పై చర్యలకు కార్మికశాఖ ఉత్తర్వులు
- సీపీఐ(ఎం) పోరాటంతో తెర పైకి..
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ఎల్అండ్టీ మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించిన సెస్ ఎగవేత విషయంలో కోర్టులో కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదో 15రోజుల్లో వివరణ ఇవ్వాలి' అంటూ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆర్.చంద్రశేఖరాన్ని తెలంగాణ సర్కార్ ఆదేశించింది. దీనికి సంబంధించి ఈనెల 15వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.526ని జారీ చేసింది.
అసలేం జరిగింది?
రాష్ట్రంలోనూ, గ్రేటర్ హైదరాబాద్‌లోనూ రూ.10లక్షలకుపైన పనులు చేసిన వందలాది కంపెనీల నుంచి కార్మికశాఖ సెస్ వసూలు చేయడం లేదని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలో ఎల్అండ్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించిన 1శాతం సెస్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) పోరాడింది. దీంతో సెస్ రూ.163.75కోట్లు చెల్లించాలని 2014లో ఎల్అండ్టీ మెట్రోరైలు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు రంగారెడ్డి జిల్లా జాయింట్ కమిషనర్ లేఖ రాశారు. దానిపై ఎల్అండ్టీ మెట్రోరైలు ప్రాజెక్టు యాజమాన్యం 2014లో హైకోర్టు నుంచి డబ్ల్యూపీ నెం.35582/2014 స్టే తెచ్చుకుంది. అయితే, స్టే ఎత్తివేయడానికి కార్మికశాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనిపై సైతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఫిర్యాదు చేసింది. అయినా అధికారులు స్పందించలేదు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా నివేదిక ఇచ్చింది. వీటన్నింటి నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ జాయింట్ కమిషనర్(హెడ్ఆఫీసు) ఆర్.చంద్రశేఖరంపై ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది. సదరు అధికారి ఇచ్చిన వివరణ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముంది. అప్పటి వరకు వేచిచూడాల్సిందే.
అవినీతిపై విచారణ జరిపించాలి:
ఎం.శ్రీనివాస్- సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి
కార్మిక శాఖలో సెస్ ఎగవేత, అవినీతిపై ఏసీబీతో విచారణ జరిపించాలి. ఒక్క ఎల్అండ్టీ మెట్రోరైలు ప్రాజెక్టు మాత్రమే కాదు వందలాది కంపెనీల నుంచి సెస్ వసూలు చేయడం లేదు. మొదట్లో ఎల్అండ్టీ మెట్రోరైలు ప్రాజెక్టు వ్యయం రూ.14వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.20వేల కోట్లకు చేరింది. 1శాతం సెస్‌తోపాటు వడ్డీ కలిపి రూ.400కోట్లకుపైగానే ఉంటుంది. మొత్తాన్ని వసూలు చేయాలి. సెస్ వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై విచారణ జరిపించాలి.