Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వేబోర్డు సభ్యులు ఆర్.కె.మంగ్ల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతీయ రైల్వేలు సాంకేతికంగా పురోగతి సాధిస్తున్నాయని రైల్వే బోర్డు సభ్యులు ఆర్.కె.మంగ్ల తెలిపారు. గురువారం హైదరాబాద్లోని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్) 65వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంగ్ల మాట్లాడుతూ లక్ష మందికి శిక్షణనిచ్చి ఇరిసెట్ అద్భుత పనితీరును ప్రదర్శించిందని తెలిపారు. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్-కవాచ్ అనేది రైళ్లకు సురక్షితమైన ఆపరేషన్ను అందించడానికి అధునాతన సాంకేతిక వ్యవస్థలకు ఒక మంచి ఉదాహరణగా అభివర్ణించారు. అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని కోరారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.జె.నారాయణన్ మాట్లాడుతూ డేటాను విశ్లేషించడానికి రైల్వేలో కృతిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ ఆధారిత సాంకేతికతలను విస్తరించాల్సిన అవసరముందని చెప్పారు. ఇరిసెట్ డైరెక్టర్ జనరల్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో కవాచ్-స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ టెక్నాలజీపై శిక్షణ కోసం కొత్త కోర్సులను ప్రారంభించినట్టు తెలిపారు. ఇరిసెట్ శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది శిక్షణార్థులకు అకడమిక్ డిస్టింక్షన్ అవార్డులు అందుకున్నారు.