Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్
- పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి వినతిపత్రం
నవతెలంగాణ- సిటీబ్యూరో
రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ నివేదికను బహిర్గతం చేయాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి గురువారం మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. పీఆర్సీ సందర్భంగా రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ టీచర్స్ నుంచి అక్రమంగా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని, గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా ఆఫీసు సూపరింటెండెంట్ కుటుంబ సభ్యుల ఖాతాల్లో వేసినట్టు టీచర్స్ బహిరంగంగా చెబుతున్నారని లేఖలో పేర్కొన్నారు. డిప్యూటేషన్ల కోసం భారీ మొత్తంలో వసూలు చేశారని, వీటిపై మీడియాలో కథనాలు కూడా వచ్చాయని గుర్తుచేశారు. అడిషనల్ డైరెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, అయినా నేటికీ సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. విజిలెన్స్ శాఖ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోవాలని, నివేదికను బహిర్గతం చేయాలని, అవినీతి నిరోధానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.