Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు నెలలుగా పట్టించుకోవడం లేదంటూ అధికారుల ఘెరావ్
నవతెలంగాణ-మంగపేట
మూడు నెలలుగా తాగునీరు రాక అల్లాడుతున్నా పట్టించుకోని అధికారులు ఇంటి, నల్లా పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారంటూ మహిళలు గ్రామపంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను ఘెరావ్ చేశారు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బిల్ట్ కర్మాగారం నడిచే రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు చెందిన 1000 మందికి పైగా కార్మికులు కమలాపురం గోదావరి రోడ్డులో ఆవాసాలు ఏర్పరుచుకున్నారు. 2015 ఏప్రిల్ 15న కర్మాగారం మూతపడటంతో కొన్ని కుటుంబాలు తిరిగి వెళ్లిపోయాయి. వందకు పైగా కుటుంబాలు 30 సంవత్సరాలకు పైగా ఇక్కడే జీవనం సాగిస్తున్నాయి. ఏటా ఈ కుటుంబాల నుంచి కమలాపురం గ్రామపంచాయతీ అధికారులు ఇంటి పన్నులు, నల్లా పన్నులు వసూలు చేస్తున్నా వారికి మౌలిక సదుపాయాలైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు వంటివి సౌకర్యాలు కల్పించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి ఒడ్డునే ఉంటూ నిత్యం తాగునీటికి అల్లాడుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు పెద్దఎత్తున కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను అడ్డుకున్నారు. మూడు నెలలుగా ప్రతి రోజూ తాగునీటికి అల్లాడుతున్నామని, చుక్కనీరు దొరకడం లేదని.. రోజు కూలీ చేసుకునే తమ కుటుంబాలు తాగునీటి కోసం పనులు మానుకో వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్పినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా, మండల అధికారు లు స్పందించి తమకు తాగునీరు అందించకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.