Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పబ్లిక్ పాలసీ పరిశోధనని తెలంగాణ వ్యాప్తంగా బలోపేతం చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయంలోని రాజనీతి శాస్త్ర విభాగం నిర్వహిస్తున్న '' 75 ఏండ్లలో పబ్లిక్ పాలసీ - ఒక పునరావలోకనం'' అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. సదస్సులో ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వ పాలనా శాస్త్ర కోర్సుని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశ పెట్టామని చెప్పారు. ఇప్పటి నుంచి యాజమాన్య, సాంకేతిక విద్యా సంస్థల్లో విస్తరించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో ప్రధానంగా నాలుగు వర్గాలు పాలుపంచు కుంటాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, మేధావులు, పౌర సమాజ సేవ సంస్థలు, రాజకీయ ప్రాభల్యం కల్గిన సామాజిక వర్గాలు.. ఇలాంటి పాలనా నిర్మాణంలో ప్రజల పాత్ర ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రముఖ ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వం ప్రజల కోసం విధానాలు రూపొందించేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలను ప్రయివేట్ సంస్థలు అనుకరించేవన్నారు. నయా ఉదారవాద విధానాల వలన ప్రభుత్వ సంస్థలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రభుత్వ పాలనా సంస్థ ప్రధాన కార్యదర్శి ఫిలిప్ జిట్టాన్ (ఫ్రాన్స్) మాట్లాడుతూ.. వైవిధ్య సంస్కృతి కల్గిన భారతదేశం అభివృద్ధి పథంలో నడవాలంటే బలమైన ప్రభుత్వ విధానాలు ఎంతో కీలకమని తెలిపారు. సదస్సు కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చెవి గా ఉండాలని చెప్పారు. సదస్సు లో రాజనీతిశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ ఖాం ఖాన్ సుహాన్, సెమినార్ కో-కో ఆర్డినేటర్ డాక్టర్ డి. వీరబాబు, ప్రొఫెసర్ జి. సుదర్శనం, ప్రొఫెసర్ అజరు గుడవర్తి, ప్రొఫెసర్ సంజరు కుమార్, ప్రొఫెసర్ రాందాస్ రుపావత్, ప్రొఫెసర్ జి. నాగరాజ్, ప్రొఫెసర్ ముకుల్ సక్సేనా, ప్రొఫెసర్ అజిత్ ఫడ్నీస్, ప్రొఫెసర్ మ్రుదుల్ నీల్ పాల్గొనారు.