Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఎకనామిక్ అఫెన్సెస్ హ్యాండ్‌బుక్ ఫర్ ఇన్వెస్టిగేషన్' పుస్తకాన్ని ఆవిష్కరించిన మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక నేరాల పట్ల ప్రతి ఒక్క పోలీసు అధికారి అవగాహనను పెంచుకోవాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి కోరారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) డీజీపీ ఉమేశ్ షరాఫ్ రచించిన 'ఎకనామిక్ అఫెన్సెస్ హ్యాండ్‌బుక్ ఫర్ ఇన్వెస్టిగేషన్' పుస్తకాన్ని మహేందర్ రెడ్డి గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. మారుతున్న కాలానికనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందనీ, దానితో పాటే ఆధునిక టెక్నాలజీతో ఆర్థిక నేరాలూ పెరిగాయని డీజీపీ అన్నారు. గతంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులను సీఐడీ లేదా సీసీఎస్ పోలీసు విభాగాలు పరిశోధించేవనీ, ప్రస్తుతం స్థానిక పోలీసు స్టేషన్లలోనే వీటిపై విచారణ సాగుతున్నదని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా పుట్టుకొస్తున్న ఆర్థిక నేరాల పట్ల పోలీసు అధికారులు అవగాహనను పెంచుకోవటం ద్వారానే వాటిపై సమగ్రంగా దర్యాప్తు జరపవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాన్ని రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్‌కూ అందజేస్తామని డీజీపీ తెలిపారు. మాజీ డీజీపీ ఎంవీ కృష్ణరావు మాట్లాడుతూ.. ఆర్థిక నేరాల ద్వారా అమాయక ప్రజలెందరో మోసపోతున్నారనీ, వారికి న్యాయం చేసే తీరులో దర్యాప్తు సంస్థల విచారణ సాగాల్సినవసరం ఉన్నదని అన్నారు. మాజీ గవర్నర్, మాజీ డీజీపీ ఎస్ రామ్మోహన్రావు మాట్లాడుతూ.. తాము పని చేసిన కాలంలో సహకార సంస్థల్లోనే ఆర్థిఖ నేరాలు జరిగేవనీ, ఇప్పుడు విశ్వవ్యాప్తమయ్యాయనీ, వీటి పరిశోధనకు ప్రత్యేక దర్యాప్తు సంస్థలు అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఉమేశ్ షరాఫ్‌తో పాటు, డీజీపీలు గోవింద్ సింగ్, అంజనీకుమార్, మాజీ డీజీపీలు అరవిందరావు, సాంబశివరావు, ఉమేశ్ కుమార్ లతో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు.