Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోసియేషన్ల ప్రతిపాదనలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తాం :
- అటవీ ఉద్యోగ సంఘాల సమావేశంలో అటవీశాఖ ప్రధాన అధికారి ఆర్ఎం.డోబ్రియాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ శాఖలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది రక్షణ కోసం అధిక ప్రాధాన్యత ఇస్తామని పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ హామీనిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో వివిధ అటవీ ఉద్యోగ సంఘాలతో గురువారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో ఆయన సమావేశమయ్యారు. ముందుగా శ్రీనివాసరావు మృతికి నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ ఘటనను జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్, ఫారెస్ట్ రేంజర్లు, స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐఎఫ్ఎస్ అసోసియేషన్- తెలంగాణ చాఫ్టర్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. అటవీ సంరక్షణ పట్ల నిబద్దతతో పనిచేస్తున్నసిబ్బందిపై దాడులను నిరసించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో జరగకుండా చూడాలని ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బందికి ఆయుధాలను ఇచ్చే ప్రతిపాదనను వెంటనే పరిష్కరించాలనీ, ప్రత్యేక ఫారెస్ట్ స్టేషన్ల ఏర్పాటు, అటవీ శాఖలో ఖాళీల భర్తీ, రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం మరింతగా పెంచాలని కోరారు. అన్ని బీట్లలో అటవీ సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గుత్తికోయలు పోడు సాగుదారుల కిందకు రారనీ, వారిని పూర్తిగా అటవీ ఆక్రమణదారులుగా గుర్తించి అడవి నుంచి బయటకు తరలించే కార్యచరణను ప్రభుత్వం తీసుకోవాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా డోబ్రియాల్ మాట్లాడుతూ..క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీనిచ్చారు. ఫీల్డ్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తామన్నారు. ఘటన విషయంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణం స్పందించిన తీరుకు సంఘాల ప్రతినిధులు కతజ్జతలు చెప్పారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం.సీ. పర్గెయిన్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అదనపు పీసీసీఎఫ్ సునీతాభగవత్, ఇతర అధికారులు, సిబ్బంది, అన్ని అటవీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సున్నిత ప్రాంతాల్లో భద్రత కల్పిస్తాం : పీసీసీఎఫ్‌కు డీజీపీ హామీ
అటవీ ప్రాంతాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి భద్రత కల్పిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి హామీనిచ్చారు. శ్రీనివాసరావు హత్య ఘటన నేపథ్యంలో డీజీపీతో పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్ భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అటవీ సిబ్బందికి పోలీస్ శాఖతో మరింత సమన్వయం అవసరమని సూచించారు. అలాగే సిబ్బంది రక్షణకు పోలీసుల సహకారం కావాలని కోరారు. అటవీ అధికారులకు రక్షణ కల్పించే విషయంపై తక్షణమే ఆదేశాలు జారీచేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.