Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో గురువారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా సాధికారితపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నవంబర్ 25 అంతర్జాతీయ హింస వ్యతిరేక దినం నుంచి డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా సాధికారితపై విద్యాసంస్థల్లో అవగాహనా సదస్సులు, సెమినార్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశంలో నిత్యం ఏదో ఒకచోట ప్రతి నిమిషం మహిళలు దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు విద్యతో పాటు ఉపాధి రంగంలోనూ అగ్రభాగాన నిలుస్తూ సమాజాభివృద్ధిలో అన్నిరంగాల్లో ముందుంటున్నప్పటికీ ఇంకా వివక్షత కొన సాగుతూనే ఉందన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మహిళ సాధికారిక సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఆహార భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ప్రతి విద్యా సంస్థలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలతో పాటు, మహిళలు పని చేసే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుమలత, జయమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, ఐద్వా మండల ఉపాధ్యక్షులు ఎల్లమ్మ, మండల కార్యదర్శి మస్కు అరుణ, పాఠశాల టీచర్స్ జయశ్రీ, అమృత, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.