Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కంటోన్మెంట్
ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే ఐటీ అధికారులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో గురువారం హైదరాబాద్ బోయిన్పల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి మంత్రి మాట్లాడారు. రెండ్రోజులపాటు ఐటీ అధికారులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు తమ నివాసాలపై, కళాశాలలు, ఇతర సంస్థల్లో సోదాల సందర్భంగా తమను భయబ్రాంతులకు గురిచేశారని చెప్పారు. గతంలో రెండుసార్లు ఐటీ అధికారులు సోదాలు చేశారని, కానీ ఇంత దౌర్జన్యంగా ఎప్పుడూ జరగలేదని, పోలీసు బలగాలతో వచ్చి దాడులు చేయడం విచారకరమని చెప్పారు. అంతా ఆన్లైన్ ప్రాసెస్ నడుస్తుందని, తన ఇంట్లో వాళ్లకు కూడా మెడికల్ సీటు ఇవ్వలేమన్నారు. అలాంటప్పుడు అవకతవకలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. తనకు తెలియకుండా పెద్ద కొడుకుతో సంతకాలు పెట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అధికారులపై ఎక్కడా చేయి చేసుకోలేదని, వారికి పూర్తిగా సహకరించామని చెప్పారు. దొరికిన డబ్బులను అధికారులు తీసుకెళ్లారు కదా అన్నారు. కావాలని దౌర్జన్యం చేసి తమ కుటుంబ సభ్యులను, సిబ్బందిని ఇబ్బంది పెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. సోదాల పేరిట ఐటీ అధికారులు తమ తండ్రి, అమ్మాయిని కూడా చిత్రహింసలకు గురిచేశారని వెల్లడించారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు తమ నివాసాలలో ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు. పార్టీ మారాలనే ఇదంతా చేస్తున్నారని తాను అనుకుంటున్నానని చెప్పారు. తన నివాసంలో రూ.4 కోట్లు సీజ్ చేశారని చెప్పారు. కాలేజీల్లో వేతనాలకు నెలకు కనీసం కోటి రూపాయలకుపైగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఐటీ సోదాలకు తాము సహకరిస్తా మన్నారు. తాము చట్టప్రకారంగా ట్యాక్ చెల్లిస్తామని తెలిపారు.
అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు :మంత్రి మల్లారెడ్డి
ఐటీ అధికారుల వ్యవహారంలో బుధవారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. రాత్రి 10 తర్వాత ఐటీ దాడులు ముగించగా.. పంచనామాపై సంతకాల కోసం ఐటీ అధికారులు నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డితో రూ.100 కోట్ల డొనేషన్ల విషయమై పంచనామా పత్రాలపై సంతకాలు చేయించినట్టు సమాచారం.