Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలపై దాడులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- జనగామ
కాషాయ మూకలు రాష్ట్రంలో తిష్ట వేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి అప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను లొంగ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జీఎస్టీ పేరిట దోపిడీకి ఎగబడిందన్నారు. ఆర్ఎస్ఎస్ యజెండాను బలవంతంగా ప్రజల్లో రుద్దేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష సాధింపులో భాగంగా ఐటీ, ఈడీ దాడులు చేయిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వాస్తవాలను గ్రహించి పాలన కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం 20 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేశామని చెప్పారు. అందులో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం అంశం కూడా ఉందని తెలిపారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టుగా చెప్పారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం గుత్తి కొయ్యలకు భూమి పంచకుండా తాత్సారం చేయడం సరైంది కాదన్నారు. సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఇందాక వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన గుత్తి కొయ్యలకు పట్టాల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోక కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల శ్రీనివాస్, రాపర్తి రాజు, ఈ.అహల్య, నాయకులు బూడిద గోపి, చందు నాయక్, జోగు ప్రకాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.