Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ, ఐటీ, జీఎస్టీ దాడులతో ప్రజా సమస్యలు గాలికి... : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ వైఫల్యం వల్ల ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు బలయ్యారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. పోడుభూముల సమస్యను ప్రభుత్వం గత ఎనిమిదేండ్లుగా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. దీంతో ఫారెస్ట్ అధికారి ప్రాణం పోయిందనీ, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ అసెంబ్లీ సీఎల్పీ కార్యాల యంలో ఆయన విలేకర్లతో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నాన్చుడు దోరణితో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. పోడు సమస్య ఎంత జఠిలంగా మారుతున్నదనే దానికి ఈ సంఘటనే ఉదాహరణ అని వివరించారు. పోడు రైతులకు చట్టబద్దంగా హక్కులు కల్పించాలంటూ రాష్ట్ర విభజన జరిగి నప్పటి నుంచి అసెంబ్లీ లోపల, బయట తమ గళాన్ని వినిపించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం చేయాల్సిన తంతు చేయకపోవడం వల్లనే వారి సమస్య పరిష్కారంలో జాప్యం జరుగు తుందని చెప్పారు. ఎమ్మెల్యేలు చైర్మెన్‌గా ఉన్న ల్యాండ్ అసైన్డ్ కమిటి సమావేశాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి జరగడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల పార్టు-బీలో ఉన్న రైతులు భూమిపై హక్కులు లేవన్న భయంతో బతుకుతున్నారని చెప్పారు. భూమిలేని నిరుపేదలు, భూమి ఉన్న రైతుల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. భూసేకరణ చేసినప్పటికీ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గు చేటన్నారు. బీజేపీ దేశానికి అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని చెప్పారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారిగా ఉన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కడాన్ని భట్టి తీవ్రంగా తప్పుపట్టారు. శ్రీనివాస్‌రావు ప్రభుత్వ అధికారిగా కాకుండా వ్యక్తిగతంగా వందలసార్లు అయినా కేసీఆర్ కాళ్ళు 'మొక్కొచ్చు, కడుగొచ్చు, నొక్కొచ్చు' అని ఎద్దేవా చేశారు.
పరస్పర దాడులతో నాటకం
మోడీ, కేసీఆర్‌పై జగ్గారెడ్డి ఆగ్రహం
కేంద్రం ఈడీ, రాష్ట్ర ప్రభుత్వం సిట్‌తో పరస్పర దాడులు చేసుకుంటూ...నాటకాలాడుతున్నాయని ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దౌర్భాగ్య పరిపాలన అందిస్తున్నాయని చెప్పారు. ప్రజల కష్టాలను గాలికొదిలేశారని చెప్పారు. ఒకవైపు మాటల గారడి... మరోవైపు మత చిచ్చు పెట్టి చోధ్యం చూస్తున్నారని విమర్శించారు. 'అమిత్‌షా, కేసీఆర్ మధ్య నువ్వు గిచ్చినట్టు చెరు, నేను కొరికినట్టు చేస్తా' అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బలహీనతలను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయ ఎత్తుగడ అవలంభిస్తున్నదని విమర్శించారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజరు ఐటీ అధికారిలా మాట్లాడుతున్నారని చెప్పారు.
రైతు సమస్యలపై 30న ధర్నాలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ పిలుపు
రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, ధరణి తదితరు సమస్యల పరిష్కారం కోసం 30న నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. డిసెంబర్ 5న జిల్లా కేంద్రాల్లో భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు.