Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులకు వెంటనే వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జేఏసీ చైర్మెన్ కె.రాజిరెడ్డి, వైస్‌చైర్మెన్ హన్మంతు ముదిరాజ్, కో-కన్వీనర్లు జి.అబ్రహం, సుద్దాల సురేశ్, జేఏసీ నేతలు ఏవీ.రావు, కె.గీత, జీఆర్.రెడ్డి, తదితరులు మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వేతన ఒప్పందంపై తమకు కాస్త గడువు కావాలని అడిగిన రాష్ట్ర ప్రభుత్వం..ప్రస్తుతం స్పష్టత ఇవ్వకుండా గమ్ముగా ఉండటం సరిగాదన్నారు. ప్రభుత్వం సైలెంట్‌గా ఉంటే కార్మికులు తప్పుగా అర్ధం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో సమానంగా ఉండేలాగా ఫిట్మెంట్ ప్రకటించి 01.04.2017 నుంచి అమలు చేయాలనీ, 31.1 శాతం డీఏను మెర్జ్ చేసి మాస్టర్ పేస్కేలును ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ కార్మికోద్యమంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి కార్మిక సంఘాల కార్యక్రమాలను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. వెల్ఫేర్బోర్డులను రద్దు చేసి చట్ట ప్రకారం ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2013 వేతన ఒప్పంద బకాయి బాండ్లను వెంటనే చెల్లించాలని కోరారు. సీసీఎస్‌కు తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా యాజమాన్యం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీసీఎస్‌కు బకాయిపడ్డ రూ.900 కోట్లను ఇవ్వాలనీ, రికవరీలను ప్రతి నెలా చెల్లించాలని డిమాండ్ చేశారు. సిబ్బందిపై పనిభారాన్నీ, వేధింపులను తగ్గించాలని కోరారు. సంస్థలో వేధింపుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.