Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి పటిష్ట ఆరోగ్య ప్రణాళిక అవసరం
- గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నివారించదగ్గ జబ్బులతో మరణాలను తగ్గించేందుకు రాష్ట్రానికి పటిష్టమైన ఆరోగ్య ప్రణాళిక అవసరమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. 2024 నాటికి టీబీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక అవసరమని అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్లో ఆమె వైద్య ప్రముఖులతో సమావేశమయ్యారు. టీబీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసే క్రమంలో సమాజం టీబీ రోగులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. గిరిజనులు, మహిళలు తదితర అణగారిన ప్రజల్లో పౌష్టికాహార లోపం అధిగమించేందుకు స్థానికంగా తయారు చేసే మహులడ్డు తీసుకోవాలని కోరారు. రొమ్ము క్యాన్సర్తో మరణాలను నివారించేందుకు ప్రారంభదశలో రోగాన్ని నిర్దారించడం ఉత్తమ మార్గమనీ, ఇందుకోసం టెస్టుల సౌలభ్యతపై ప్రచారం నిర్వహించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రొమ్ము క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సమగ్రంగా వివరించారు. ఈ సమావేశంలో దేవ్నార్ స్కూల్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ వ్యవస్థాపకులు డాక్టర్ సాయి బాబా గౌడ్, టీబీ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ ప్రసాద్, రవి హెలియోస్ వ్యవస్థాపకులు డాక్టర్ విజరు భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలి
మెరుగైన ఆరోగ్య కోసం ప్రతి విద్యార్థి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్లో ఆమె వివిధ యూనివర్సిటీల విద్యావేత్తలతో సమావేశమయ్యారు. ఉన్నత విద్యలో విద్యార్థి సంపూర్ణ వికాసంపై దృష్టి సారించాలని తెలిపారు. మహిళా పరిశోధకుల సంఖ్య పెరిగేలా సౌకర్యాలను కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అదే స్థాయిలో కాలేజీలు, యూనివర్సిటీలలో హాస్టళ్లను పెంచాలన్నారు. మహిళా ఉపాధ్యాయుల సంఖ్య పెరిగేలా, విద్యార్థినుల డ్రాపౌట్స్ తగ్గేలా అవసరమైన వసతుల కల్పనపై విద్యావేత్తలు శ్రద్ధ పెట్టాలని గవర్నర్ సూచించారు.