Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంధన సర్‌చార్జీల పేరుతో ప్రతినెలా యూనిట్‌కు 30 పైసల వరకు పెంచి వినియోగదారుల నుంచి వసూలు చేయొద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అందుకనుగుణంగా ఈఆర్సీ ఇచ్చిన ముసాయిదా ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో పెంచిన విద్యుత్ చార్జీలతోనే పేద గృహ వినియోగదారులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అందువల్ల సర్‌చార్జీల పేరిట వడ్డనను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అమలు కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకరమైన విద్యుత్ సవరణ బిల్లును తెచ్చి, రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నదని విమర్శించారు. ఇందులో భాగంగానే ప్రజలపై విద్యుత్ భారాలను వేస్తున్నదని తెలిపారు. దొడ్డిదారిన గెజిట్ తెచ్చి ప్రజలపై భారాలు మోపేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సర్ఛార్జీలను ప్రతినెలా పెంచి వినియోగదారుల ద్వారా డిస్కాంలు వసూలు చేసుకోవాలంటూ ఈఆర్సీల మీద ఒత్తిడి పెంచుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.దీని వల్ల ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ వినియోగదారులపై భారాలు వేయడానికి పూనుకుంటున్నదని తెలిపా రు. అందువల్ల ఈఆర్సీ జారీచేసిన ముసాయిదా ఉత్తర్వులను వెనక్కి తీసుకునే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, ప్రజలపై భారాలు పడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.