Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెన్త్ పరీక్ష ఫీజు రూ.125కాగా...ప్రయివేటులో వసూలు చేసింది రూ.వెయ్యి
- కంప్యూటర్, ఇతర ఖర్చుల కోసమంటూ బుకాయింపు
- రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు
- పరీక్ష ఫీజు పేరుతో ముక్కుపిండి బకాయిల వసూళ్లు
- ప్రభుత్వ పాఠశాలల్లోనూ కొన్ని చోట్ల రూ.200తీసుకున్న వైనం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
పదో తరగతి పరీక్ష ఫీజును ప్రయివేటులో పదింతలు వసూలు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. కంప్యూటర్, ఇతర ఖర్చులు ఉంటాయని బుకాయిస్తున్నారు. అసలు పరీక్ష ఫీజు రూ.125 ఉంటే దానికి బదులు ఫీజు రూ.900, పాస్ఫొటోలకు మరో రూ.100 తీసుకురావాలని చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే మాత్రం ప్రతియేడూ ఫీజు ఇంతే ఉంటుందని, అది కూడా తెలియదా? అంటూ తల్లిదండ్రులకు ఎదురు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే, కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో రూ.వెయ్యి వరకు వసూలు చేస్తే.. బడ్జెట్ స్కూళ్లలో రూ.500 నుంచి రూ.700 మధ్య వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో రెగ్యులర్ ఫీజు కడితేనే పరీక్ష ఫీజు తీసుకుంటామని బెదిరించి మరీ బకాయిలన్నీ ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లోనూ కొన్ని చోట్ల ఒక్కో విద్యార్థి నుంచి రూ.200వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రయివేటు పాఠశాలల యజమానులు, ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది ఏ చిన్న అవకాశం వచ్చినా తమకు అనుకూలంగా మార్చుకుంటున్న పరిస్థితి. గతేడాది పదో తరగతి పరీక్ష ఫీజును రెండింతలు వసూలు చేసిన సర్కారు స్కూళ్ల పరిస్థితిపై 'నవతెలంగాణ' రాసిన కథనానికి అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఈ ఏడాది కూడా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు తీరు మార్చుకోకుండా టెన్త్ ఎగ్జామ్ ఫీజు రూ.125 ఉంటే రూ.200 వరకు వసూలు చేశాయి. ఇదే సమయంలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా పదోతరగతి పరీక్ష ఫీజు తీసుకునే సందర్భాన్ని స్కూల్ ఫీజు వసూళ్లకు వినియోగించుకున్నాయి.
సరైన సమాధానం చెప్పకుండా...
సాధారణంగా ప్రయివేటు పాఠశాలల్లో సాధారణ ఫీజులో రాయితీలు అడిగే విద్యార్థుల తల్లిదండ్రులు పదోతరగతి పరీక్ష ఫీజుపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. రూ.వేలు, రూ.లక్షల్లో ఫీజులు కడుతున్న కొంత మంది తల్లిదండ్రులు పరీక్ష ఫీజు రూ.700 నుంచి రూ.వెయ్యి అడిగినా పెద్దగా పట్టించుకోకుండానే చెల్లిస్తున్నారు. అయితే, పరీక్ష ఫీజుపై అవగాహన ఉన్న కొంతమంది తల్లిదండ్రులు మాత్రం పదింతల ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే అధికారుల పేరు చెప్పి జారుకుంటున్న పరిస్థితి. నవంబర్ మొదటి వారం నుంచే బకాయిలన్నీ కడితేనే పదోతరగతి పరీక్ష ఫీజు తీసుకుంటామని, ఈ విషయం తల్లిదండ్రులకు ఫోన్లు, వాట్సప్ మెసేజ్ల ద్వారా సమాచారాన్ని అందించినట్టు తెలుస్తోంది. పరీక్ష ఫీజు కింద రూ.900, పాస్ఫొటోలకు రూ.100 తీసుకురావాలని హకుం జారీ చేశారు. కొన్ని పాఠశాలలు పరీక్ష ఫీజు రూ.500 నుంచి రూ.700వరకు ఇవ్వాలని సూచించారు. ఇలా కేవలం పదోతరగతి పరీక్ష ఫీజు వసూళ్ల పేరుతోనే ఒక్కో కార్పొరేట్ స్థాయి ప్రయివేటు పాఠశాలలు రూ.లక్షల్లో దండుకున్నాయి.
ఆదేశాలు బేఖాతరు...
మార్చి మొదటి వారంలోనే పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ఇదివరకే ప్రకటించింది. నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాలని అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది.విద్యార్థుల నుంచి వసూలు చేసిన రుసుం మొత్తాన్ని బ్యాంకుల్లో చలానా తీసి ఈ నెల 17వ తేదీలోగా ట్రేజరీలో సమర్పించా లని చెప్పింది.విద్యార్థుల పూర్తి వివరాలతో కూడిన పత్రాలను సైతం ఈనెల 24వ తేదీలోగా డీఈఓ కార్యాలయాల్లో అందించా లని పేర్కొంది. అయితే, జిల్లాలోని వసతిగృ హాలు, గురుకులా లు, కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రం ప్రభుత్వమే పరీక్ష ఫీజు చెల్లిస్తోంది. ఇక మిగతా ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశా లలు సహా ప్రయివేటు పాఠశాలల పిల్లలందరూ గడువు లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సిందే.ఈ నేపథ్యం లో ఈ ఏడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 50వేల మంది విద్యార్థు లు పరీక్ష రాయబోతున్నారు.ఇదే అదనుగా ప్రయివేటు యాజమాన్యాలు ట్యూషన్, టర్ము, కంప్యూటర్ వంటి అనేక పేర్లతో ఇష్టారీతిన ఫీజులు తీసుకుంటున్నాయి.
అధికారులు చర్యలు తీసుకోవాలి
రజనీకాంత్- ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
పదోతరగతి పరీక్ష ఫీజును రెట్టింపు స్థాయిలో వసూలు చేసిన ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవా లి. పరీక్ష ఫీజు పేరుతో బలవంతంగా బకాయిలన్నీ వసూలు చేస్తున్న వారిని కట్టడి చేయాలి. కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తల్లిదండ్రులు నుంచి విద్యాసంవత్సరా నికి చెందిన పూర్తి ఫీజు ఇప్పుడే వసూలు చేయడం సరికాదు. ప్రయివే టు పాఠశాలల యాజమాన్యాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి.