Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మూడో మహాసభలో తుమ్మల వీరారెడ్డి
- తెలంగాణ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-మిర్యాలగూడ
హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మొహమ్మద్ బిన్ సయ్యిద్ నగర్ (జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్) పిచ్చిమట్టల పెంటయ్య ప్రాంగణంలో గురువారం ఆ సంఘం రాష్ట్ర 3వ మహాసభ నిర్వహించారు.
ముందుగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మహాసభలో వీరారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది హమాలీ కార్మికులు ఉన్నారని, ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో పనిచేస్తున్నారని, వీరికి సమగ్ర చట్టం చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల మాదిరిగానే హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికిగాను సెస్ నిధులు సమకూర్చాలన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పారు. సంక్షేమ బోర్డు ద్వారా హమాలీ కార్మికులను ఆదుకోవాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటలు అమలు చేస్తుందని, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. ఆ విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కనీస వేతన అమలుకు నోచుకోవడం లేదని వాపోయారు. వలస కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని, వలస కార్మికుల చట్టం అమలు చేయాలని కోరారు. ఐదు సంవత్సరాలకోసారి చట్టం రీ షెడ్యూల్ చేయాలన్నారు. హమాలీ కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, ప్రమాద ఆరోగ్య బీమాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్, కోశాధికారి వంగూరి రాములు మాట్లాడుతూ.. ఐకేపీ సెంటర్లలో రెండు లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారని, వారికి హమాలీ చార్జీలు ప్రభుత్వమే చెల్లించాలన్నారు. డీఆర్డీఏ పరిధిలో కార్మికులకు ఇన్సూరెన్స్ సంపూర్ణంగా కల్పించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. సివిల్ సప్లై గోదాముల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు పెంచాలని, మార్కెట్ యార్డులు వృథాగా ఉండకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. హమాలీ కార్మికుల నుంచి సంవత్సరానికి రూ.37 వేల కోట్ల ఆదాయం వస్తుందని, ప్రభుత్వం వారి సంక్షేమం కోసం నిధులు కేటాయించాలని కోరారు. ఎర్ర శ్రీకాంత్, యూ.శ్రీనివాస్, తిరుపతి రామ్మూర్తి, బి.రాములు అధ్యక్షత వహించిన ఈ మహాసభలో జిల్లా ఉపాధ్యక్షులు డబ్బీకార్ మల్లేష్, ఎలక్ట్రిసిటీ స్టోర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కత్తుల యాదగిరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వై.సోమన్న, ట్రాన్స్‌ఫోర్టు హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
61 మందితో రాష్ట్ర నూతన కమిటీ
తెలంగాణ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నూతన కమిటీని 61 మందితో ఎన్నుకున్నారు. వీరిలో 31 మందిని ఆఫీస్ బేరర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా తుమ్ముల వీరారెడ్డి, అధ్యక్ష కార్యదర్శులుగా భూక్య శ్రీనివాస్, వంగూరి రాములు, కోశాధికారిగా కనకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు 14 మందిని ఉపాధ్యక్షులుగా, 12 మందిని సహాయ కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. ఇద్దరిని కో ఆప్షన్లుగా ఎనుకున్నారు.