Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో కేసీఆర్ వ్యూహం
- నాయకులు, కార్యకర్తల్లో భరోసా కల్పించేందుకు యోచన
- వచ్చే నెలలో శాసనసభ, మండలి సమావేశాలు
- ఏర్పాట్లు చేయాలంటూ మంత్రులు వేముల, హరీశ్‌కు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ దాడులు.. మరోవైపు గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు.. ఇంకోవైపు తన ఎంపీలను ఉసిగొలిపి వ్యక్తిగత దూషణ భాషణలకు కమలం పార్టీ దిగుతున్న నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్ వాటన్నింటికీ అసెంబ్లీ వేదికగా చెక్ పెట్టనున్నారు. కొద్ది రోజుల కిందట నిర్వహించిన టీఆర్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో 'త్వరలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లు, సంస్థలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయంటూ...' ఆయన హెచ్చరించిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పుడు కేంద్రం అదే పనిగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా ఆయా సంస్థలతో దాడులు కొనసాగిస్తున్నది. ఇప్పటికే మంత్రులు తలసాని, గంగుల, మల్లారెడ్డి, ఎంపీ నామా తదితరుల సంస్థలపై ఈడీ, ఐటీ దాడులు కొనసాగిన నేపథ్యంలో ఆయా నేతలతోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో సైతం నైరాశ్యం అలుముకున్నది. ఈ నేపథ్యంలో వారికి భరోసానివ్వాలని సీఎం నిర్ణయించారు. 'ఎలాంటి దాడులు జరిగినా భయపడొద్దు.. బీఆర్ఎస్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుదాం.. కేంద్రానికి లొంగాల్సిన అవసరం లేదు...' అనే పద్ధతుల్లో ఆయన వారిలో ధైర్యం నూరిపోయాలని సంక్పలించారు. ఇందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని నిర్ణయించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్ర అసెంబ్లీని కూడా సమావేశపరచాల్సి ఉంటుంది. అందువల్ల స్వామి కార్యం, స్వకార్యం కోసం శాసన సభ, మండలి సమవేశాలను డిసెంబరులో నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకనుగుణంగా ఏరాట్లు చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని, ఆర్థిక మంత్రి హరీశ్‌రావును ఆయన ఆదేశించారు.
మరోవైపు రాష్ట్ర శాసనసభకు వచ్చే ఏడాది డిసెంబరులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అంటే 2023 జనవరి నుంచే తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ కొనసాగనుందన్నమాట. ఈ క్రమంలో డిసెంబరులో నిర్వహించబోయే సమావేశాలు కీలకం కానున్నాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ జమా ఖర్చుల కోసం మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారు. కానీ ఆ తర్వాత ఎన్నికల హడావుడి ఊపందుకుంటుంది. ఈ కారణాలన్నింటి రీత్యా వచ్చే నెలలో నిర్వహించబోయే సమావేశాలే పూర్తి స్థాయి సమావేశాలు అవుతాయని భావిస్తున్నామని టీఆర్ఎస్కు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. గత సమావేశాల్లో ఈటల రాజేందర్ సహా బీజేపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి విదితమే. మరి ఈసారి వారి విషయంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా బీజేపీయే లక్ష్యంగా, కేంద్ర విధానాలే టార్గెట్‌గా అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి.
అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022 -23)లో తెలంగాణకు రావాల్సిన ఆర్థిక వనరుల్లో రూ.40 వేల కోట్లు తగ్గాయని సీఎం కేసీఆర్ గురవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రాభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటున్నదని విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకే వచ్చే నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు.