Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వసతి గృహాల్లో కనిపించని కనీస సౌకర్యాలు
- అలంకారప్రాయంగా మారిన సోలార్ హీటర్లు
- విద్యార్థులకు చన్నీటి స్నానమే దిక్కు
- ఆశ్రమాల్లో మూడేండ్ల నుంచి దుప్పట్లు కరువు
- వసతులపై దృష్టిసారించని అధికార యంత్రాంగం
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, జైనూర్, పెంచికల్పేట, లక్ష్మణచాంద
పేద విద్యార్థులకు చదువుతోపాటు వసతి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఏండ్లు గడుస్తున్నా వసతిగృహాల సమస్యలు పరిష్కరించడంలో అటు ప్రభుత్వం.. ఇటు అధికార యంత్రాంగం దృష్టిసారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతిగృహాలు, గురుకులాలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అరకొర సౌకర్యాల మధ్యనే విద్యార్థులు చదువులు కొనసాగించాల్సి వస్తోంది. చలి కాలంలో విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రతి ఏటా విద్యార్థులు గజగజ వణుకుతూ చన్నీటితో స్నానం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న సంఘటనలు ఉన్నాయి. అయినా, అధికారులు సోలార్ హీటర్లను బాగుచేయించడంలో విఫలమవుతున్నారు. రాష్ట్రంలోని మిగతా గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతిగృహాలతోపాటు ఒకే దగ్గర చదువుతోపాటు వసతి ఉండేలా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలను ప్రభుత్వం నెలకొల్పింది. ప్రభుత్వం వీటిలో చదువుకొనే విద్యార్థుల సంక్షేమం కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఈ పాఠశాలల్లో అధికారుల అలసత్వం కారణంగా సౌకర్యాలు కలగానే మారుతున్నాయి. ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బాల్లో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన సోలార్ వాటర్ హీటర్లు పనిచేయకుండా అలంకారప్రాయంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేడి నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఉదయం చన్నీటితో స్నానం చేయడం వల్ల వణికిపోతున్నారు.
ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లే..
జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో 54 ఆశ్రమ ఉన్నతపాఠశాలలు ఉండగా, సుమారు 19వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలల్లో ఐటీడీఏ నుంచి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. మూడేండ్ల కిందట విద్యార్థులకు అందజేసిన దుప్పట్లనే విద్యార్థులు ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ఇవి కూడా చలిని తట్టుకొనే స్థితిలో లేకపోవడంతో కొందరు విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకొని చలి నుంచి రక్షణ పొందుతున్నారు. మూడేండ్ల నుంచి కొత్త దుప్పట్లు అందజేయడం లేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. మిగతా వసతిగృహాల్లోనూ నాసిరకం దుప్పట్లు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క అనేక వసతిగృహాల భవనాలకు కిటికీలు, తలుపులు ఊడిపోవడంతో చలి నేరుగా గదుల్లోకి వచ్చేస్తోంది. ఆయా చోట్ల విద్యార్థులే కిటికీలకు అట్టముక్కలు అడ్డుపెట్టి చలి తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు. ప్రతి నిత్యం ఆయా శాఖల అధికారులు వసతిగృహాలను సందర్శిస్తున్నా సమస్యలను మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చిన్న పాటి సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితిలో ఉన్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం కూడా వసతిగృహాల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అవి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.