Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వమే రైతులకు ప్రధాన సమస్య
- కార్పొరేట్ల గుత్తాధిపత్యం కోసమే సాగు చట్టాలు
- శ్రీలంక పరిస్థితులొస్తే దేశానికి ఇబ్బందులు తప్పవు
- ధరణితో రైతులకు కొత్త చిక్కులు
- కౌలు రైతులను గుర్తించాలి
- 'నవతెలంగాణ'తో తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అన్నదాతలు...చావలేక బతుకుతున్నరని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కేంద్ర ప్రభుత్వమే ప్రధాన సమస్యగా, శత్రువుగా మారిందని చెప్పారు. కార్పొరేట్ల గుత్తాధిపత్యం కోసమే కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలు తెచ్చిందని చెప్పారు. శ్రీలంక పరిస్థితులు మనదేశంలో తలెత్తితే చాలా ఇబ్బందులొస్తాయన్నారు. అప్పుడు మన దేశాన్ని ఆదుకునే నాథుడే ఉండబోడని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులకు కొత్త చిక్కులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు అవస్థలు పడుతున్నారని చెప్పారు. కౌలు రైతులను గుర్తించడం లేదన్నారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు నల్లగొండలో జరగనున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ సభలను పురస్కరించుకుని 'నవతెలంగాణ' ప్రతినిధి గుడిగ రఘుతో ప్రత్యేకంగా మాట్లాడారు.
దేశంలో రైతుల స్థితిగతులెలా ఉన్నాయి? వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి?
రైతులకు కేంద్రమే ప్రధాన సమస్యగా మారింది. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు అప్పజేప్పే ప్రయత్నం చేస్తున్నది. మూడు సాగు చట్టాలను తీసుకొచ్చి రైతులను నట్టేట ముంచేందుకు ప్రయత్నించింది. భూములు, మార్కెట్లను కార్పొరేట్లకు అప్పజేప్పేందుకు వీలు కల్పించేందుకే ఈ చట్టాలు తీసుకొచ్చింది. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేది పైకి చెప్పే మాట. కానీ వ్యవసాయంపై కార్పొరేట్ల పెత్తనం పెరిగిపోతుంది. స్వామినాథన్ సిపార్సులు అమలు చేస్తామని మోడీ ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పటిదాకా వాటిని అమలు చేయలేదు. పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలనే సూచనను పట్టించుకోలేదు. ఎన్సీబీఆర్ ప్రకారం దేశంలో 1.52 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం. విద్యుత్ సవరణ చట్టం ద్వారా కేంద్రం రైతులకు సబ్సిడీ లేకుండా చేస్తున్నది. ఇది దుర్మార్గమైన ఆలోచన. రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ రంగాన్ని కేంద్రం తమ చేతుల్లోకి తీసుకుంది. దీంతో ఫెడరలిజాన్ని ధ్వంసం చేస్తున్నది. వ్యవసాయ రంగాన్ని నష్టపరించే ఎత్తుగడలు వేస్తున్నది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి.
పీఎం ప్రణామ్ యోజన అంతర్యమేంటి? దాంతో అన్నదాతలకు కలిగే ప్రయోజనమేంటి?
రసాయనిక ఎరువులను తగ్గించడం, సేంద్రీయ సాగును ప్రోత్సహించడమే దీని లక్ష్యం. కానీ ఈ పద్దతిని అనుసరించిన శ్రీలంక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటుంది. కన్నతల్లిలాగానే భూమిని తల్లిలా చూసుకోవాంటూ మోడీ చెప్పారు. భూమి తల్లి నుంచి అధిక ఉత్పత్తి తీయడం కోసం విపరీతమైన ఎరువులు వాడుతున్నారు. ఆ ఎరువుల సబ్సిడీని రాష్ట్రాలకు అప్పగిస్తామని మోడీ ప్రకటించారు. ఎరువుల సడ్సిడీ ఉండదు. సీసీఐ, ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్, నాఫెడ్ తదితర సంస్థలు ఉండవు. ఈ పరిస్థితుల్లో ఆహార దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది. సమీపకాలంలో మన దేశ జనాభా 140 కోట్లకు చేరురోబోతున్నది. అలాంటి సమయంలో ఆహారోత్పత్తి పెంచుకోవాల్సిన చోట దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంక పరిస్థితులు వస్తే దేశాన్ని ఎవరు ఆదుకుంటారు.
ధరణి పోర్టల్‌తో రైతుల సమస్యలు తీరాయా?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం మంచిదే కావొచ్చు. ఉద్దేశాలన్నీ సత్పలితాలిస్తాయని అనుకోలేం. కానీ ధరణి పోర్టల్ కొత్త సమస్యలు లేకుండా చూడాల్సిన ధరణి అదనపు సమస్యలు సృష్టించింది. సమస్య రాకుండా హోంవర్క్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయాలి. మేధావుల కంటే గ్రామాల్లో రైతులతో ఎక్కువగా చర్చించాలి. కాగిత రహిత కార్డులకు కేంద్రం ఆలోచన చేస్తున్నది. వీఆర్వోలు, ఎమ్మెర్వోలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మ్యూటేషన్ అవుతుంది. దళారీల బెడద లేదు. అయితే హక్కు పత్రాల విషయంలో లోపాలు ఉన్నాయి. పేర్ల మార్పులు చేయడం కష్టంగా మారింది. ఈ బాధ్యతలను కలెక్టర్‌కు అప్పగించారు. కుగ్రామంలోని రైతులు కలెక్టర్లకు వద్దకు వెళ్లగలడా? చిన్న, చిన్న సమస్యను కారణాలు చూపించి నిషేధిత జాబితాలో భూములను చూపించారు. రాష్ట్రంలో 25లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఇవి అత్యధికంగా దళితులు, బడుగు, బలహీన వర్గాలకు వారికి చెందినవే. ధరణిలో 20 ఏండ్ల నుంచి రికార్డు పొందుపరిచాలి. రైతులు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తే బాగుటుంది.
కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు? ఈ సమస్యపై ఏం చేయబోతున్నారు?
కోతుల సమస్య అనగానే నవ్వుకుంటారు. కానీ రాష్ట్రంలో కోతుల దండుతో రైతులు అవస్థలు పడుతున్నారు. పండిన పంటలను అవి నాశనం చేస్తున్నాయి. ప్రస్తుతం రైతులకు ఇదో పెద్ద సమస్య, దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. ధాన్యం కొనుగోళ్లు, మార్కెట్ సమస్య, విత్తనాలు, పంట నష్టపరిహారం, కౌలుదారులు, పోడు తదితర సమస్యలపై మహాసభల్లో సమగ్రంగా చర్చించి, కార్యాచరణ రూపొందిస్తాం. పోరాటాలు ఉధృతం చేస్తాం.