Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సృష్టించిన సంపదలో మనకు వాటా రావాలి : సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
- పెరిగిన ధరలకు అనుకూలంగా కనీస వేతనం ఇవ్వాలి : రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
జీతభత్యాల కోసమే కాదు.. కార్మికుల మనుగడను ప్రశ్నార్థకం చేసిన పాలకవర్గ విధానాలను ఎండగడుతూ కార్మిక చట్టాలను కాపాడుకుంటామని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు అన్నారు. శుక్రవారం సీఐటీయూ వనపర్తి జిల్లా మూడో మహాసభను కొత్తకోటలో 24, 25 తేదీల్లో మండ్ల రాజు అధ్యక్షతన నిర్వహించారు. ముగింపు సందర్భంగా జరిగిన భహిరంగ సభలో సాబుబాబు మాట్లాడారు.
వనపర్తి జిల్లాలో మూడు లక్షల మంది కార్మికులు కనీస వేతనాలకు దూరంగా ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్లకు ఏడు నెలల నుంచి వేతనాలు లేకుంటే ఎలా జీవిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిషన్ భగీరథ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న పాలకులను.. అందులో పని చేస్తున్న కార్మికులు వేతనాలు అడిగితే తప్పేంటని ప్రశ్నించారు.
మరోవైపు ప్రధాని మోడీకి కార్మికుల సమస్యలు ఏవీ పట్టడం లేదని విమర్శించారు. పేదలు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉండటం సరికాదన్నారు. రుచికరమైన భోజనం పెట్టకుండా భేటీ పడావో అంటూ నినాదాలు ఇవ్వడం బీజేపీకి చెల్లిందన్నారు. ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశాలు, అంగన్వాడీల సమస్యలు ఎందుకు పరిష్కారం చేయడం లేదని ప్రశ్నించారు. 1977లో వచ్చిన అంగన్వాడీ వ్యవస్థలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల చట్టం అమలు చేయాలని కోరారు. ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని, బంగారు తెలంగాణ దూసుకుపోతుందని చెబుతున్న పాలకులు కార్మికుల జీతభత్యాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 470 రూపాయలు ధర ఉన్న గ్యాస్ ఇప్పుడు 1000 రూపాయలకు పైగా పెరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా అన్నారు. దేశ సంపదకు కారకులైన కార్మికులు, రైతుల పట్ల మోడీ ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి కార్మికునికీ నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి మాట్లా డుతూ.. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను వేధిస్తున్న అధికారులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లాలో ఆశా కార్యకర్త చనిపోతే ఆమె కుటుంబానికి సీఐటీయూ అండగా నిలిచిందని గుర్తు చేశారు. రూ.26 వేల కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 60 ఏండ్లు దాటిన ప్రతి ఒకరికీ పింఛన్ ఇవ్వాలన్నారు. సభలో సీఐటీయూ వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు మహమూద్, సునీత, రమేష్, శ్రీహరి, గోపాలకృష్ణ, ఎం.రాములు, రాము, నిక్సన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.