Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన పెట్టుబడులు తగ్గిన దిగుబడులు
- స్థిరీకరణలేని ధరలు-అప్పుల్లో అన్నదాత
- సరిపోని పంట రుణాలు
- కరువైన కనీస మద్దతు ధర
- రేపటి నుంచి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ
నవతెలంగాణ- మిర్యాలగూడ
మార్కెట్లో దొరికే ప్రతి వస్తువుకూ యజమానే ధర నిర్ణయిస్తాడు.. ఆయన నిర్ణయించిన ధరకే వినియోగ దారుడు కొనుక్కోవాలి. కానీ రైతు పండించిన పంటకు మాత్రం ధర నిర్ణయించే అధికారం రైతులకు ఉండదు.. వ్యాపారస్తులు సూచించిన ధరకే పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి సమాజంలో నెలకొంది. భూమిని నమ్ముకొని కాయకష్టం చేస్తున్న అన్నదాత ప్రతి సీజన్లోనూ నష్టపోతున్నాడు. పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడుల కారణంగా.. స్థిరీకరమైన ధరలు లేకపోవడంతో అన్న దాతలు అప్పుల పాలవుతున్నారు. పంట రుణాలు కూడా బ్యాంకులు సరిగ్గా ఇవ్వకపోవడంతో ప్రయివేటు వడ్డీ వ్యాపార స్తులను ఆశ్రయించి అప్పుల పాలవుతూ ప్రాణం మీదికి తెచ్చుకుం టున్నారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే వరకు రైతన్నలు కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అందరి ఆకలి తీర్చే అన్నదాత ఆకలితో అలమటిస్తూ ప్రాణం పోగొట్టుకుంటున్నా పాలకులు కనికరించడం లేదు.
అడుగుడుగునా దగా..
రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మిరపకాయ, ఆరుతడి పంటలు, పసుపు, చెరుకు, పండ్లు, కూరగాయలు, సుబాబుల్, జామాయిల్, పామాయిల్ పంటలను సాగు చేస్తున్నారు. రైతులు పంట సాగు చేసే దశలోనే నాసిరకం విత్తనాలతో నష్టపోతున్నారు. ఆపై ఎరువులు, పురుగుల మందులకు వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇందులోను నకిలీలతో నష్టపోతున్నారు. ఎకరాకు 50 నుంచి 70 వేల రూపాయలకు పెట్టుబడులు పెట్టాక.. వచ్చిన దిగుబడి పంటను మార్కెట్లో అమ్ముకుంటే పెట్టుబడులే వెళ్లని పరిస్థితి. కోత మిషన్లు, రవాణా చార్జీలు, హమాలీ, గుమస్తా చార్జీలు అంతా రైతుపైనే వేయడం వల్ల ఆ భారం మొత్తం మోయాల్సి వస్తుంది. దీంతో పెట్టిన పెట్టుబడి వెళ్లగా అప్పుల పాలవుతున్నారు.
రైతు ఉద్యమాలకు సిద్ధం..
వ్యవసాయ రంగంలో వస్తున్న సమస్యలపై సమరశీలంగా పోరాటాల నిర్వహించేందుకు అఖిల భారత కిసాన్ సభ ముందుండి పోరాడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 60 లక్షల మంది రైతులు ఉండగా.. ఐదు లక్షల మంది సభ్యులతో తెలంగాణ రైతు సంఘం సభ్యత్వం పొంది. రైతులకు అండగా నిలిచి ఉద్యమాలు సాగిస్తోంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 27వ తేదీ నుంచి 29 తేదీ వరకు జరగనున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలో రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇప్పటివరకు చేపట్టిన ఉద్యమాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రధాన డిమాండ్లపై తీర్మానం చేసి వాటి అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేనున్నారు. మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు సాగిన సుదీర్ఘ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు ఉద్యమాలకు నాంది పలకనున్నారు. ఈ నేపథ్యంలో జరిగే ఈ రైతు మహాసభకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.