Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం
- సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బావుట ఎగురవేసింది ప్రజానాట్యమండలి
- తెలుగునాట ప్రజాసాంస్కృతికోద్యమ సారధి : రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి
- ఉత్సాహభరితంగా రాష్ట్ర 4వ వీధి నాటకోత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ - నల్లగొండ
దేశాన్ని అమ్ముతున్న మోడీని తక్షణమే గద్దె దించాల్సిన అవసరం ఉందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాలగూడ జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. 27, 28, 29 తేదీల్లో నల్లగొండలో జరగనున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ నేపథ్యంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర నాలుగో వీధి నాటకోత్సవాలు శుక్రవారం ఎన్జీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. సఫ్దర్ హస్మి చిత్రపటానికి పూలమాలలు వేసి 2022-షాట్‌ను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి జూలకంటి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకుండా బడా బాబుల జేబులు నింపుతోందని విమర్శించారు. రైతులకు న్యాయం చేయని, కార్మికులకు కష్టాలు తెచ్చిన ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బావుటా ఎగురవేసింది ప్రజానాట్యమండలేనని చెప్పారు. 70 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజా సాంస్కృతి కోద్యమ సంస్థగా, రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనే ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇండియన్ పీపుల్స్ థియేటర్ (ఇష్టా)కు వారసురాలిగా ఏర్పడిన ప్రజానాట్య మండలి కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని చాటి చెప్పింద న్నారు. తెలుగునాట ప్రజా సాంస్కృతికోద్యమ సారధిగా ప్రజానాట్యమండలి పనిచేస్తుందని చెప్పారు.
సారా వ్యతిరేక ఉద్యమం, మద్యంపై యుద్ధం పేరుతో వేలాది కళా ప్రదర్శనలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసింద న్నారు. శ్రీశ్రీ, గురజాడ, వేమన, కందుకూరి, జాషువా, వీరబ్రహ్మం వంటి సంఘ సంస్కర్తల భావజాలాన్ని, వారి రచనల సందేశాన్ని కళారూపాలుగా మలచి పల్లెల్లో, పట్టణాల్లో వాడవాడలా విస్తృత ప్రచారాన్ని నిర్వహించిందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు పోరాట చరిత్రను వీధినాటికగా మలచి వందలాది ప్రదర్శనలిచ్చింది ప్రజానాట్యమండలి అని చెప్పారు. దళిత, ఆదివాసుల హక్కుల రక్షణ కోసం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ప్రచార జాతాల్లో వందలాది మంది కళాకారులతో ప్రదర్శనలు చేశారని తెలిపారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమ బాట నడిచిన సఫ్దర్ హస్మి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ అడుగు వేయాలని సూచించారు. కేంద్రంలో మోడీని గద్దె దింపేందుకు కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో చేతులు కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డమీద మతోన్మాద శక్తులకు స్థానం కల్పించొద్దని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్టలను కొట్టే చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి రైతాంగాన్ని రక్షించుకోవాలన్నారు.
ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పరిశోధకులు అనిత, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు యాదగిరి, అవ్వారు గోవర్ధన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొండూరు భాస్కర్, కెేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, ఆవాజ్ రాష్ట్ర నాయకులు సయ్యద్ హాషం తదితరులు పాల్గొన్నారు.
ప్రదర్శించిన కళారూపాలు
కళారూపాల సమన్వయకర్త సాంబరాజు యాదగిరి ఆధ్వర్యంలో అల్లా బోల్, డెమోక్రసీ, రైతు బతుకు ఒగ్గు కథ, చిరుతల కథ, గోసంగి, వీర తెలంగాణ నాటికలను ప్రదర్శించారు.
డప్పు వైద్యాలతో పట్టణంలో భారీ ర్యాలీ
తెలంగాణ రైతు సంఘం మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి కళాకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.