Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తపస్, డీటీఎఫ్, టీఎస్టీయూ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం జిల్లా అకడమిక్ టాస్క్ఫోర్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని తపస్, డీటీఎఫ్, టీఎస్టీయూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ఎం సోమయ్య, మహమ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శ్లులు నవాత్ సురేష్, టి లింగారెడ్డి, చందూరి రాజిరెడ్డి శుక్రవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ప్రతి పాఠశాలలో విద్యాబోధన ప్రశాంత వాతావరణంలో నిరంతరాయంగా జరగాలని తెలిపారు. కానీ మెజార్టీ పాఠశాలల్లో ఒక్కరూ లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో బోధన సాగుతున్నదని పేర్కొన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 18 సబ్జెక్టులకు బోధన చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని తీసుకుని కేవలం ఉపాధ్యాయులనే దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. విద్యారంగంలో నెలకొన్న సంస్థాగత లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. పర్యవేక్షణాధికారి పోస్టులను నింపాలనీ, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. సమస్యలను పరిష్కరించకుండా పాఠశాలల పర్యవేక్షణ పేరుతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.