Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎయిడెడ్ ఉపాధ్యాయుల గతనెల వేతనాలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సప్లిమెంటరీ (అనుబంధ) వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండేండ్లుగా వేతనాలు ప్రతి నెల మొదటి తేదీన ఇవ్వటం లేదని తెలిపారు. సప్లిమెంటరీ బిల్లులు, సెలవు వేతనాలు, జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్, పీఆర్సీ, డీఏ బకాయిలు, విశ్రాంత ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర బిల్లులు ట్రెజరీల్లో ఆమోదం పొంది నెలలు గడుస్తున్నా నిధులు విడుదల కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సందర్భాల్లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసి ప్రాతినిధ్యాలు చేసినప్పుడు పాక్షికంగా కొన్ని బిల్లులు మంజూరవుతున్నాయని పేర్కొన్నారు. ఇంకా అనేక బిల్లులు పెండింగ్‌లోనే ఉంటున్నాయని తెలిపారు. అవసరాలకు డబ్బు సర్దుబాటు కాక పలువురు ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులన్నింటినీ తక్షణమే విడుదల చేయాలనీ, బకాయిల చెల్లింపునకు నిర్దిష్ట గడువు విధించి టోకెన్ నెంబర్ల ప్రకారం నిధులు చెల్లించాలని కోరారు.