Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెసులుబాటు కాగానే రుణమాఫీ చేస్తాం
- డిసెంబర్లో యాసంగి రైతుబంధు విడుదల
- వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ- రఘునాథపాలెం
తెలంగాణ రైతు దేశానికి ఆదర్శమని, రైతు కేంద్రంగా సగర్వంగా రాష్ట్రం నడుస్తుందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండా వద్ద రూ.14.90 కోట్లతో నిర్మించిన 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 3 గోదాముల సముదాయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌తో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపట్టిందన్నారు. దేశంలో ఎక్కడా గోదాముల నిర్మాణం జరగట్లేదన్నారు. ఒక్క రాష్ట్రంలోనే వాటి ప్రాముఖ్యత గుర్తెరిగి నిర్మిస్తున్నట్టు అన్నారు. యాసంగి రైతుబంధు డిసెంబర్లో రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. రుణమాఫీని రూ.36వేల వరకు చేశామని, అమలులో ఉన్న సంక్షేమ పథకాలు వేటినీ ఆపలేదని అన్నారు. కొంత వెసులుబాటు కాగానే రుణమాఫీ మొత్తం చేయనున్నట్టు తెలిపారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మెన్ లింగాల కమల్‌రాజ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ వేద సాయిచందర్, కలెక్టర్ గౌతమ్, డీసీసీబీ చైర్మెన్ నాగభూషణం, మేయర్ నీరజ, సుడా చైర్మెన్ విజయ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మెన్ లక్ష్మీ ప్రసన్న, ఎంపీపీ గౌరీ, జడ్పీటీసీ ప్రియాంక, వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.