Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్నం 12:30కి మహాప్రదర్శన ప్రారంభం
- ఆతర్వాత బహిరంగ సభ
- వేలాదిగా తరలిరానున్న గ్రామపంచాయతీ కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) నాలుగో రాష్ట్ర మహాసభ జరుగనున్నది. 26న మధ్యాహ్నం 12:30 గంటలకు నాగర్‌కర్నూల్‌లోని లహరి గార్డెన్ నుంచి జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్ వరకు గ్రామపంచాయతీ కార్మికులు భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. ఆ తర్వాత జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఉంటుంది. ప్రదర్శనలో మహిళా బృందం ముందుభాగంలో నడువనున్నది. మహాసభ అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమై ఆదివారం వరకు కొనసాగనున్నది. ఈ మహాసభకు 400 మంది ప్రతినిధులు రానున్నారు. ముఖ్య అతిథులుగా సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి పి.జయలక్ష్మి, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గణపతిరెడ్డి, చాగంటి వెంకటయ్య పాల్గొననున్నారు. జీపీ కార్మికులకు ప్రస్తుతం అందుతున్న రూ.8,500 వేతనాన్ని సాధించడంలో టీఎస్‌జీపీఈడబ్ల్యూయూ పాత్ర మరువలేనిది. అయితే, పెరిగిన నిత్యావసర ధరలు, ఇతరత్రా ఖర్చుల నేపథ్యంలో ఈ వేతనాలు సరిపోవు వారికి కనీస వేతనాలు ఇవ్వడంతోపాటు పర్మినెంట్ చేయాలని నిఖరంగా పోరాడుతున్నది. మల్టీపర్పస్ విధానం రద్దు, జీవో నెంబర్ 51 సవరణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నది. జీపీల్లో పనిచేసే కలం కార్మికులైన కారోబార్లు, బిల్‌కలెక్టర్లకు ప్రత్యేక హౌదా కల్పించాలని రాష్ట్ర సర్కారుతో కొట్టాడుతున్నది. జీపీ కార్మికుల సమస్యలపై ఇప్పటికే ఒకసారి ప్రగతిభవన్‌ను కూడా ముట్టడించిన సంగతి తెలిసిందే.
కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో టీఎస్‌జీపీఈడబ్ల్యూయూ పోరాటాల వల్ల కొన్ని విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మున్సిపాల్టీల్లోని కార్మికులకు ఇస్తున్న వేతనాన్ని జీపీ కార్మికులకూ ఇవ్వాలనీ, ఒకే పనిచేసేవారికి వేతనాల్లో తేడా ఎందుకు అని రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నది. గ్రామ పంచాయతీల నిధులను సకాలంలో ఇవ్వాలనీ, కార్మికుల వేతనాలను ప్రభుత్వమే వారి ఖాతాల్లో వేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కారును ఎప్పటి నుంచో కోరుతున్నది. హక్కుల కోసం, కనీస వేతనాల కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ గ్రామపంచాయతీ కార్మికుల ఆదరాభిమానాలను చూరగొంటున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆ యూనియన్ రాష్ట్ర మహాసభలకు ప్రత్యేకత నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి బహిరంగ సభకు వేలాది మంది కార్మికులు తరలిరానున్నారు. మహాసభలో గ్రామ పంచాయతీ కార్మికుల కోసం చేయాల్సిన భవిష్యత్ పోరాటాల కార్యాచరణ, గత మహాసభ నుంచి నేటి వరకు చేసిన పోరాటాలపై ప్రధానంగా చర్చ నడువనున్నది.