Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షం పడినా ఇబ్బంది లేకుండా ప్రధాన రోడ్ల నిర్మాణం
- కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధిలో ముందుకే..
- శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
- రూ.466 కోట్లలో ఫ్లైఓవర్ నిర్మాణం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా విస్తరణకు చర్యలు తీసుకుంటామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు చెప్పారు. గచ్చిబౌలి వద్ద రూ.466 కోట్లతో 2.81 పొడవుతో నిర్మించిన శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్‌ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్, మెట్రోరైలు, ఆర్టీసీ విస్తరణకు పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఎంటీఎస్ అభివృద్ధికి రూ.200 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. రెండో విడతలో మొత్తం 63 కిలోమీటర్ల మెట్రోరైలు విస్తరణ చేయనున్నట్టు చెప్పారు. బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డికాపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మరో 5 కిలోమీటర్లతోపాటుగా మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కిలోమీటర్ల పొడవుతో మెట్రోరైలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తున్నదని, కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా ప్రజా రవాణా అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నదని చెప్పారు.
ఎస్‌ఆర్‌డీపీి సీఎం కేసీఆర్ మాసపత్రిక అని, విశ్వనగరంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఎస్‌ఆర్‌డీపీ పథకాన్ని జీహెచ్‌ఎంసీకి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు అప్పజెప్పినట్టు చెప్పారు. రూ.8వేల కోట్లతో ఈ పథకాన్ని చేపట్టాలని రూపకల్పన చేసి 48 పనులను చేపట్టగా.. ఇప్పటికే 33 పనులు పూర్తిచేసినట్టు, మిగతా పనులు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. ఇక్కడ ఉన్న సదుపాయాలు దేశంలోని మెట్రో నగరాలు అయిన చెన్నై, బెంగళూరు, ముంబాయి, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్‌లో లేవన్నారు.
రోజురోజుకూ పరిశ్రమ, ఐటీ రంగం విస్తరణ పెరగడంతో ఏడాదికి లక్ష కుటుంబాలు స్థిరపడుతున్నాయని, ఒకే ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ నలుమూలలు విస్తరించడంతోపాటు అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ రెండో దశలో రూ.3,500 కోట్లతో చేపట్టనున్నట్టు తెలిపారు. వర్షం పడినా ఇబ్బంది కలుగకుండా ప్రధాన రోడ్లను సీఆర్‌ఎంపీ ద్వారా చేపట్టినట్టు చెప్పారు. రేపటి అవసరాల కోసం మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసినా జనాభాకు అనుకూలంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో స్టేజ్-2 ద్వారా గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు థర్డ్ లేవల్ బ్రిడ్జిని మరో పది నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, కొత్తగూడ ఫ్లైఓవర్‌ను డిసెంబర్ చివరికిగానీ వచ్చే ఏడాది మొదటి వారంలోగానీ ప్రారంభిస్తామని తెలిపారు. గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను కూడా పూర్తి చేసేందుకు మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కోరుతామని తెలిపారు. ఈ ఫ్లైఓవర్‌కు అండర్‌పాస్ నిర్మాణాన్ని రూ.20కోట్లతో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. రవాణా వ్యవస్థతోపాటు గ్రీనరీ అభివృద్ధికి పది శాతం బడ్జెట్‌ను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. బల్దియా అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో జీహెచ్‌ఎంసీ ద్వారా చేపట్టిన అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా రవాణాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ అరికెపూడి గాంధీ, స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మెన్ బాలమల్లు, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, సురభివాణీదేవి, డిప్యూటీ మేయర్ శ్రీలత, చీఫ్ ఇంజినీర్ దేవానంద్, ఎస్‌ఈ వెంకటరమణ, డీఈ హరీష్, కార్పొరేటర్లు రాగం నాగేందర్‌యాదవ్, గంగాధర్‌రెడ్డి, షేకహేమీద్ పాల్గొన్నారు.