Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతికున్నప్పుడే అద్దె ఇల్లు..చనిపోతే శ్మశానమే దిక్కు
- చివరి క్షణాల్లో కుటుంబ పెద్దను కాష్టానికి తీసుకొచ్చిన తల్లీకూతుళ్లు
- తుదిశ్వాస విడిచాక అతికష్టమ్మీద అంత్యక్రియలు
- ఇదీ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలిచివేసిన ఓ నిరుపేదింటి దుస్థితి
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'ఎవరైనా చనిపోయినంక శ్మశానానికి తీసుకొస్తరు. కిడ్నీ ఫెయిల్ అయి చావుబతుకుల్లో ఉన్న మా నాన్నను ప్రాణం ఉన్నప్పుడే కాష్టానికి తీసుకొచ్చినం. ఓనరోల్లు రానియ్యకపోవడంతో ఏం చేయాల్నో అర్థం కాక.. ఎక్కడ ఉండాల్నో తెల్వక.. మిగిలింది ఈ చోటేనని శ్మశానికి వచ్చాం. కొన ఊపిరితో ఉన్న నాన్నను 24గంటలూ కాపలా కాస్తూ... కాలుతున్న కాష్టాల దగ్గర ముగ్గురు ఆడవాళ్లం గజగజ వణుకుతూ గడిపాం. నాన్న తుదిశ్వాస విడిచాక ఇక్కడే అంత్యక్రియలు చేసి కర్మకాండలు చేశాం. నాలుగేండ్ల కిందట గుండెపోటుతో అన్నయ్య చనిపోయినప్పుడూ ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాం. అయితే, అప్పుడు అన్నయ్య మృతదేహాన్ని శ్మశానికి తెస్తే.. నాన్న బతికున్నప్పుడే వల్లకాడుకు తీసుకొచ్చాం. ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దు' అంటూ కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన తల్లీకూతుళ్లు భారతి, స్వప్న, సరిత 'నవతెలంగాణ'తో బోరున విలపించారు. మరో ఘటనలో జిల్లా కేంద్రానికే చెందిన నేరెళ్ల మహేష్ ఆపరేషన్ వికటించి మరణిస్తే.. అల్గునూర్ చౌరస్తాలోనే శవాన్ని వేసుకుని అంత్యక్రియలు నిర్వహించింది ఆ కుటుంబం. చివరికి అదే వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో తలదాచుకుని కర్మకాండలు నిర్వహించుకుంది.
ఇలాంటి ఘటనలు ఏ ఒక్కరి సమస్యో కాదు.. పట్టణాల్లో అద్దెకుండే కుటుంబాలందరిదీ. బతికున్నంత వరకూ ఆప్యాయంగా కబుర్లు చెప్పే ఇండ్ల యజమానులు ప్రాణం పోయాక శవాలను దూరం పెడుతున్నారు. మూఢనమ్మకాల ప్రభావం వేళ్లూనుకున్న పట్టణాల్లో ఇలాంటి దురాచార సంస్కృతి మనుషుల్లో మంచితనం, మానవత్వాన్ని మంటగలుపుతోంది. సొంతిల్లు.. కనీసం సొంత జాగా లేని కుటుంబాల్లో నిత్యం ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రం సహా కార్మికక్షేత్రాలైన రాజన్నసిరిసిల్ల, రామగుండంలాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి చేనేత పని కోసం సిరిసిల్లకు వచ్చి అద్దె ఇండ్లలో స్థిరపడిన నేత కార్మిక కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే చందాలు వేసుకుని దహన సంస్కారాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక్కడ సొంతిల్లు, జాగాలేని నేత కార్మిక కుటుంబాలే అద్దెఇండ్లలో సుమారు పది వేల వరకూ ఉన్నాయి.
చనిపోతే శవం బయటే..
కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, రామగుండంలాంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో సొంతిల్లు, జాగ లేని కుటుంబాలు సుమారు లక్షన్నరకుపైగానే ఉంటాయని ఓ అంచనా. ఇక పిల్లల చదువుల కోసమనో, వ్యాపారాల కోసమనో పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి స్థిరపడిన వారూ ఆ సంఖ్యకు మించే ఉంటారు. ఈ పరిస్థితిలో అద్దెకుండే కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే ఇంటి యజమానులు శవాలను తీసుకరానివ్వడం లేదు. ప్రాణం ఎక్కడ పోయినా పలువురు ఇండ్ల యజమానులు మాత్రం అద్దెకుండే వారి శవాన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. బయటి వ్యక్తులు ఇంట్లో చనిపోతే అరిష్టమని, ఇల్లు మూసేయాల్సి వస్తుందన్న మూఢ నమ్మకాలను పెంచుకుంటున్నారు. బాగా చదువుకున్న వారు సైతం నాగరికతను మర్చిపోయి పాతతరం మనుషుల్లా ఆలోచిస్తున్నారు. మనిషి దూరమైన బాధతో కన్నీరు మున్నీరయ్యే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం మరిచి మృతదేహాలను బయటే ఉంచాలని నిర్దయగా చెప్పేస్తున్నారు.
వేళ్లూనుకుంటున్న మూఢాచారాలు
మత ఆచారాలు, కుల కట్టుబాట్లు.. మూఢనమ్మకాలు.. ఇలా ఏవైనా రానురానూ మనిషిలో మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. అదీ నాగరికత ఉన్న పట్టణాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అద్దెకుండే ఇంట్లో శుభకార్యాలు, విందులు, వినోదాలుంటే పాల్గొనే యజమాని.. అదే అద్దెకున్న మనిషి కన్నుమూస్తే మాత్రం అటు వైపుచూడటం లేదు సరికదా.. ఇంట్లోకి మృతదేహాన్ని తీసుకరానివ్వని వారు కొందరు ఉంటే.. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని చెప్పే ఘనులూ ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు మనుషుల్లోనే మార్పురావాలి తప్ప.. చట్టాలు ఎన్ని ఉన్నా.. మార్పు సాధ్యంకాని పరిస్థితి నెలకొంది.
ఊరూరా శ్మశానవాటికలు, పట్టణాల్లో కర్మకాండ భవనాలు
వై.సునిల్రావు- కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్
గతంలో సొంతజాగ లేక, శ్మశానవాటికలు లేక చాలా మంది పేదలు ఇంట్లో ఎవరైనా చనిపోతే రోడ్డు మీదనో, చెరువుల్లోనో దహన సంస్కారాలు నిర్వహించుకునేవాళ్లు.. అలాంటి పరిస్థితికి పూర్తిగా చరమగీతం పాడిన తెలంగాణ రాష్ట్ర సర్కారు ఊరూరికీ శ్మశానవాటికలు నిర్మించింది. కర్మకాండలు నిర్వహించుకునేందుకు సొంతిల్లు లేని వారి కోసం ఈ ఐదేండ్లలో భవనాలూ నిర్మించింది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 12రోజుల కర్మకాండల కోసం సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ భవనాల సంఖ్య మరిన్ని పెంచుతాం.