Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆహ్వానం సంఘం
- సభాస్థలాన్ని పరిశీలించిన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
- నేడు జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన
- 30 వేల మందితో ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ
నవతెలంగాణ- నల్లగొండ
పోరాటాల గడ్డ నల్లగొండ జిల్లా రైతు ఉద్యమ కార్యాచరణకు వేదికైంది. వ్యవసాయ జిల్లాగా పేరొందిన నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభ జరగనుంది. ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగుతున్న రైతు వేడుకకు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చేపట్టిన రైతు ఉద్యమాలపై సమీక్షించుకోవడంతోపాటు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణను మహాసభలో రూపొందించనున్నారు. రైతాంగ సమస్యలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ మహాసభ ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలోని ఏచూరిగార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న మహాసభలో 800 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
ఆదివారం జరిగే బహిరంగసభకు 30 వేలమంది రైతులు తరలిరానున్నారు. దీనికి జాతీయ స్థాయి నాయకులూ హాజరవుతున్నారు. మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ పది రోజులుగా నగరంలో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను రైతుసంఘం, మహాసభ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో మహాసభకు సంబంధించిన ప్లెక్సీలను ఏర్పాటు చేసి వివిధ కూడళ్లలో గోడరాతలు రాశారు. బహిరంగసభ జరిగే ఎన్‌జీ కళాశాల మైదానం వద్ద, ప్రతినిధుల సభ జరిగే ఏచూరిగార్డెన్ ఫంక్షన్‌హాల్‌ను స్వాగత తోరణాలతో సిద్ధం చేశారు.
మహాసభ కార్యక్రమ వివరాలు..
మహాసభ మొదటి రోజు 27న నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగసభ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలో రైతుప్రదర్శన ఉంటుంది. కలెక్టరేట్ ఎదురుగా ఎఫ్‌సీఐ రోడ్ నుంచి ప్రకాశంబజార్ మైసయ్య విగ్రహం పెద్దగడియారం మీదుగా ఎన్‌జీ కళాశాల మైదానానికి చేరనుంది. అనంతరం అక్కడ సభ ప్రారంభం కానుంది. మహాసభ జరిగే ప్రాంతాన్ని వీరనారి మల్లు స్వరాజ్యం నగరంగా నామకరణం చేశారు. మహాసభకు ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశోక్ దావలె, ప్రధానకార్యదర్శి హన్నన్‌మొల్లా, జాతీయ సహాయ కార్యదర్శి విజ్జూ కృష్ణన్, ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఆహ్వానసంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి హాజరవుతున్నారు.
28న ఉదయం నుంచి ప్రతినిధుల సభ ఏచూరిగార్డెన్ ఫంక్షన్‌హాలులో ప్రారంభం కానుంది. ఈ వేదికకు మాలి పురుషోత్తంరెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంగా నామకరణం చేశారు. 29న 'వ్యవసాయ సమస్యలు-ఐక్యఉద్యమాలు- ఆవశ్యకత' అంశంపై సదస్సు జరగనుంది. ఇదే సమయంలో వామపక్ష రైతు సంఘాల సందేశాలు ఉంటాయి. మధ్యాహ్నం చర్చలు, వివిధ అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. అనంతరం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికతో మహాసభ ముగుస్తుంది.
సభావేదికను పరిశీలించిన జూలకంటి
ఎన్జీ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభ వేదిక, ఏచూరి గార్డెన్‌లో ప్రతినిధుల సభ ఏర్పాట్లను శనివారం ఆహ్వానసంఘం అధ్యక్షులు, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఆహ్వాన సంఘం సభ్యులు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, సయ్యద్‌హాషం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, ఎండి.సలీం, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ తదితరులు ఉన్నారు.
మహాసభకు సంబంధించి అన్ని పూర్తి చేసినట్టు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మండల, గ్రామాల్లో ప్రచారం నిర్వహించినట్టు చెప్పారు. బహిరంగసభకు రైతులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నా మన్నారు. భారీ ప్రదర్శనలో కోలాటం, పలు రకాల వేషధారణలతో కళాకారులు పాల్గొంటారని చెప్పారు.