Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రబుల్‌కు కారణమేంటో డబుల్ ఇంజిన్ సర్కార్ చెప్పాలి :
టిఫా స్కానింగ్ మిషన్ల ప్రారంభోత్సవంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆరోగ్య రంగానికి సంబంధించిన నిటిఅయోగ్ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటే, బీజేపీ పాలిత ఉత్తర్‌ప్రదేశ్ చివరి స్థానంలో ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని పెట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి నుంచి వర్చువల్ పద్ధతిలో రాష్ట్రంలోని 44 ఆస్పత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సర్కారు డబుల్ ఇంజిన్ సర్కారంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరోగ్యరంగం ఎందుకు ట్రబుల్‌లో ఉందో చెప్పాలని సవాల్ చేశారు. పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్భంలో ఉండగానే గుర్తించేందుకు 'టిఫా' (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ స్కాన్) దోహదం చేస్తుందని తెలిపారు. ''ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే 155 ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్లు ఉన్నాయి. నెలకు సగటున 11 నుంచి 12 వేల పరీక్షలు జరుగుతున్నాయి.
అయితే వీటిలో గుర్తించలేని లోపాలను టిఫా స్కాన్ వల్ల మాత్రమే ఇలాంటివి గుర్తించగలుగుతాం. వీటి కోసం రూ. 20 కోట్లు వెచ్చించాం. దీని కోసం ఇప్పటికే రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రయివేటులో టిఫా స్కాన్‌కు రూ. 2000-3000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక నుంచి ఈ ఆర్థిక భారం పేదలకు పూర్తిగా తప్పుతుంది. ప్రతి నెల సగటున 20 వేల మంది గర్బిణులు ఈ సేవలు ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. గర్బిణులకు18 నుంచి 22 వారాల మధ్య ఈ స్కాన్ చేయాల్సి ఉంటుంది. నిపుణులైన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే ఈ స్కాన్ చేస్తారు. గర్బంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని ఇందులో భాగంగా స్కాన్ చేస్తారు. ఇందుకు కనీసం 20-30 నిమిషాలు పడుతుంది. శిశువు గర్బంలో ఏ పొజిషన్‌లో ఉన్నది, జరాయువు లేదా మావి (ప్లాసెంటా) ఏ ప్రాంతంలో ఉన్నది, ఉమ్మ నీరు స్థితి వంటి వాటిని గుర్తిస్తారు. అంతర్జాతీయ నివేదికలు, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం... ఏడు శాతం శిశువుల్లో లోపాలుండే అవకాశం ఉంది. అంటే పుట్టే ప్రతి 100 మందిలో ఏడుగురు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 12 లక్షల 66 వేల మంది బాలింతలకు రూ. 263 కోట్లు విలువ చేసే కేసీఆర్ కిట్లు, ఆర్థిక సాయం రూ. 1,261 కోట్లుతో కలుపుకుని రూ.1,525 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొత్త ఆస్పత్రుల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, తదితర అభివద్ధి పనుల కోసం రూ. 403 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో రూ.55 కోట్లతో 200 పడకల ఎంసీహెచ్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నిమ్స్‌లో రూ.55 కోట్లతో 200 పడకల ఎంసీహెచ్ మంజూరు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,900 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చుతున్నామనీ, దీంతో 3,800 గ్రామాల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2014 లో ప్రభుత్వాస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే ప్రస్తుతం అది 66 శాతానికి పెరిగిందని తెలిపారు. గతేడాది కన్నా ఈ ఏడాది అక్టోబర్‌లో సి-సెక్షన్లు ఏడు శాతం తగ్గాయన్నారు. ఆరగ్యరంగానికి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, ఇది గుర్తించకుండా రాష్ట్రానికి వచ్చే బీజేపీ నాయకులు ప్రచారం కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌంమంత్రి మహమూద్ అలీ, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజరు కుమార్, పెట్ల బురుజు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, మెటర్నల్ హెల్త్ జెడి డాక్టర్ పద్మజ, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శశికళ తదితరులు పాల్గొన్నారు.