Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్ అభియాన్‌లో పాత పెన్షన్ ట్రెండింగ్‌లో మొదటి స్థానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఉన్న నూతన పెన్షన్ విధానంలోనే ఉద్యోగ ఉపాధ్యాయులు నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ హక్కు పాత పెన్షన్ అని తెలిపేటట్టు శనివారం ట్విట్టర్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ రూల్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఉందనీ, అదే విధంగా ఏడవ షెడ్యూల్ ఆర్టికల్ 246లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు రాష్ట్ర జాబితాలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. పీఎఫ్‌ఆర్డీఏ చట్టం ఇందుకు వ్యతిరేకంగా ఉందనీ, రాజ్యాంగం ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయుల సామాజిక భద్రత ప్రభుత్వాలదేననని తెలిపారు. అయితే పీఎఫ్‌ఆర్డీఏ చట్టం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తు షేర్ మార్కెట్ పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నిధిని తిరిగిచ్చేందుకు అవకాశం లేదని చెప్పడం విడ్డూరమని అన్నారు. ట్విట్టర్ ట్రెండింగ్‌లో కాన్స్టిట్యూషనల్ డే ఓపిఎస్ మొదటి స్థానంలోనే కొనసాగటం పట్ల మరొకసారి ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పెన్షన్ విధానంపై ఉన్న వ్యతిరేకత బహిర్గతమైందన్నారు. ఈ చట్టం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీపీఎస్ ఓయూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్‌లు పాల్గొన్నారు.