Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.18 వేల కోట్ల వ్యయంతో 2.91 లక్షల ఇండ్ల నిర్మాణం.
- రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు రెండు పడకల ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నిరుపేదలకు రెండు పడకల ఇండ్ల నిర్మాణాలు చేపట్టి ఉచితంగా ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో 2.91 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.18 వేల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మున్సిపాల్టీల్లో, గ్రామాల్లో ఇప్పటికే అన్ని ఇండ్ల నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నాయి. వాటికి మౌళిక సదుపాయాలు రోడ్డు, విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు పూర్తి చేసి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. 2023 జనవరి 15 వ తేదీ లోపల ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే పూర్తి చేయించి మౌళిక వసతులు కల్పించి లబ్ధిదారులను ఎంపిక చేసి అప్పగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
ముందుగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలనీ, వచ్చిన దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లకు పంపించాలనీ, క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపించాలని కోరింది. అనంతరం అట్టి జాబితాను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితా పంపించడం జరుగుతుందని తెలిపింది. కట్టిన ఇండ్ల కంటే అర్హులైన లబ్ధిదారులు ఎక్కువ ఉంటే లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని మిగిలిన వారి జాబితాను వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా జిల్లాల్లో లక్ష్యంగా పెట్టుకున్న రెండు పడకల ఇండ్ల నిర్మాణ పనుల్లో ఇప్పటికే టెండర్ పూర్తై నిర్మాణ దశలో ఉన్న వాటిని జనవరి 15లోగా పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది.