Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కులను హరిస్తే ఊరుకోం...
- మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న ఢిల్లీ ముట్టడి
- సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు
- గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభ ప్రారంభం
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
''కార్మికుల హక్కులను హరిస్తే పాలకవర్గాలకు శంకరగిరి మాన్యాలు తప్పవు.. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న పంచాయతీ కార్మికులకు కనీస వేతన చట్టం ఎందుకు అమలు చేయడం లేదు? కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేయాలి..''అని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభ శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా గ్రామపంచాయతీ పరిధిలో సేవలందిస్తున్న కార్మికులకు కనీస వేతనం ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, విధానాలు మారుతున్నా కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మురికిలో పనిచేస్తూ అనారోగ్యాలకు గురవుతున్న కార్మికులు బలమైన ఆహారం తీసుకోలేని దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కనీస వేతనం రూ.26000 పెంచాలని దేశ ఉన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 24 గంటలు అత్యవసర సేవలు అందిస్తున్న ఆశాలు, అంగన్‌వాడీలు, గ్రామపంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ వెలిగిపోతుందన్న మోడీ.. ఆకలి దారిద్య్రంలో మన దేశం ప్రపంచంలో 107వ స్థానంలో ఎందుకు నిలిచిందని ప్రశ్నించారు. దేశ ఆహార నిలువలను పందికొక్కులు కాజేస్తున్నా.. బడుగు బలహీన వర్గాలు, పేదలకు పంపిణీ చేయడం లేదన్నారు. దేశ సంపద 100 రూపాయల్లో 73 రూపాయలు ఒకరికి చెందితే. 27 రూపాయలు 99 మందికి వెళ్తున్నాయని చెప్పారు. శాశ్వత పనుల దగ్గర ఉద్యోగస్తులను సైతం శాశ్వత ఉద్యోగులుగా నియమించాలన్న నిబంధనలను తుంగలో తొక్కడం దారుణం అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తానన్న కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గజపతి, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి, అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి మల్లేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.