Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనువాదుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
- డీఎస్‌ఎంఎం జాతీయ కార్యదర్శి వి శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగలక్ష్యాలను విద్వంసం చేస్తూ.. మరో వైపు రాజ్యాంగ దినోత్సవాలు నిర్వహిస్తున్నదని దళిత శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్‌ఎంఎం) జాతీయ కార్యదర్శి వి శ్రీనివాస రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ అధ్యక్షతన 'మనువాదం వద్దు రాజ్యాంగం ముదు'్ద అనే అంశంపై చర్చా గోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు15స్వాతంత్య్ర దినం జనవరి26 గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతలను తగ్గించడానికి ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో మోడీ పాలన సాగుతున్నదని తెలిపారు. సామాజిక న్యాయానికి విఘాతం కలిగించే ఉద్దేశంతోనే ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రద్దు చేశారన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గారని గుర్తుచేశారు. దళితులపై జరిగిన దాడుల్లో 100కేసులు నమోదయితే 24మందికి మాత్రమే శిక్ష పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్ర్రయివేట్ పరం చేస్తూ రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారనీ, తద్వారా సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నదని విమర్శించారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లలో సామాజిక న్యాయ అన్యాయాన్ని సరిచేయాలన్నారు. దళిత క్రైస్తవులందరికి ఎస్సీ హౌదా కల్పించాలన్నారు ప్రస్తుత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు. ఎమర్జెన్సీ విధించకుండానే అంతకంటే ఎక్కువ నిర్బంధాన్ని అమలు చేస్తుందన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ సాంస్కృతిక సామాజిక రంగాల్లో సమరశీల పోరాటాలు నిర్మించాలన్నారు. ఈ చర్చావేదికలో టీపీటీపీఎస్‌కే రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వరు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి అబ్బాస్, కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి రమణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, డి వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సీనియర్ నాయకులు జి రఘుపాల్, పి ఎస్ ఎన్ మూర్తి, ఎస్సీ ఉపకులాల ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కడమంచి రాంబాబు విజరు తదితరులు పాల్గొన్నారు.