Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్లోని సోమాజిగూడలో రాజ్ భవన్ రోడ్డులో శనివారం రైతు, గిరిజన, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్, సైఫాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లకు తరలించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని, రైతు రుణ విముక్తి చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమ సమయంలో 80 వేల మందిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, రైతు, వ్యవసాయ కార్మికులకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరి ఘటనలో ఐదుగురి హత్యకు కారకులైన కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే, 16 నెలలకు పైగా సాగిన రైతు ఉద్యమం సందర్భంగా ప్రధానమంత్రి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.అరెస్టు అయిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, ఉజ్జిని యాదగిరిరావు, నాయకులు రాయల చంద్రశేఖర్ ప్రసాద్, పశ్యపద్మ, టి.సాగర్, వేములపల్లి వెంకట్రామయ్య, మట్టయ్య రమావత్, అంజయ్య నాయక్, బి.రాజు, లతా, స్వరూప, శ్రీరామ్, బాల మల్లేష్, పుస్తెల సృజన, సంధ్య, ఇందిరా, బిక్షపతి, భాగం హేమంతరావు, సుదర్శన్ రావు, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు, గిరిజన ప్రజాసంఘాల నాయకులు తదితరులున్నారు.