Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి మద్దతుతో మునుగోడులో టీఆర్‌ఎస్ గెలుపు
- నేనూ ప్రజానాట్యమండలిలో పనిచేశా..
- షాట్-2022 వీధి నాటకోత్సవాల్లో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నవతెలంగాణ- నల్లగొండ
వందల ఎకరాల భూములున్నా వదిలేసి.. ప్రజల కోసం నిరంతరం పనిచేసిన చరిత్ర కమ్యూనిస్టు నాయకులదని కవి, గాయకులు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో మునుగోడలో టీఆర్‌ఎస్ గెలిచిందని చెప్పారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్ర నాలుగో వీధి నాటకోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రారంభించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ.. ప్రజానాట్యమండలి సుదీర్ఘమైన చరిత్ర కలిగి ఉందని చెప్పారు. 1983లో తాను కూడా ప్రజానాట్యమండలిలో పని చేశానని గుర్తు చేసుకున్నారు. ''గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది'' అన్న పాట పాడగా.. సభ అభిమానులు, కళాకారుల చప్పట్లతో మారు మోగింది. అనంతరం ప్రజానాట్యమండలి ఆధ్వ ర్యంలో గోరటి వెంకన్నను ఘనంగా సన్మానించారు.
పీఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, ఆవాజ్ రాష్ట్ర నాయకులు సయ్యద్ హషం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, కార్మిక సంఘం నాయకులు నారి ఐలయ్య, పాటల రచయిత కాకం ఆంజనేయులు, పీఎన్‌ఎం రాష్ట్ర సహాయ కార్యదర్శులు కల్యాణి, జక్కిడి నర్సింహారెడ్డి, కవి, గాయకులు అంబటి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
కళారూపాలు..
కళారూపాల సమన్వయకర్త, ప్రజానాట్యమండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల సదానంద్ ఆధ్వర్యంలో హోరుగాలి, రైతు దేశం, గెలవాలి రేలారేలా.., వీర తెలంగాణ నాటికలు ప్రదర్శించారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కళారూపాలను తిలకించారు.