Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బట్టలెన్ని ఉతికినా పూట గడవని వైనం
- కాళ్లు, నడుము, కీళ్ల నొప్పులు
- మురికి నీళ్లు.. డిటర్జెంట్స్ వల్ల చర్మవ్యాధులు
- లాండ్రీలకు ఉచిత కరెంట్ ఉత్తమాటే..
- వాషింగ్ మిషన్లు, డ్రైక్లీనర్లతో కరువైన పని
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
'మాయితో పుట్టినోణ్ని మల్లెపూవోలే చేసి
ముట్టు బట్టలుతికి.. మురికంతా ఎల్లాగడిగి
ఎగదుడిసీ.. దిగా దుడిసీ.. దిష్టీ పూసాలు కట్టి'
అంటూ ప్రజావాగ్గేయకారులు గోరటి వెంకన్న పాడిన పాట అక్షర సత్యం. రజక వృత్తిదారులు బండచాకిరీ చేసినా పూటగడవని దుస్థితి. పొద్దున్నే చాకిరేవుకెళ్లి మురికి బట్టలు ఉతికి.. ఉతికి అలసిపోతున్నారు. కాళ్లు, నడువు, కీళ్ల నొప్పులతో తిప్పలు పడుతున్నారు. చెర్వు, కుంటల్లోని మురికి నీళ్లు.. సబ్బు, సర్ఫ్ వంటి డిటర్జెంట్స్ వల్ల చర్మవ్యాధుల పాలవుతున్నారు. బట్టలెన్ని ఉతికినా.. ఇస్త్రీ ఎంత చేసినా పూటగడవడం కష్టంగా మారింది. మరోవైపు వాషింగ్ మిషన్లు, డ్రైక్లీనర్స్ వంటి యంత్రాలొచ్చాక బట్టలుతికే పని దొరకట్లేదు. చావు, పెళ్లిళ్లకు చాకిరీ చేసినా సరిపడా కూలి డబ్బులివ్వరు. లాండ్రీషాపులకు ఉచిత కరెంట్ పథకం ఉట్టెక్కింది. ఏ ఆసరా లేని తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు, పింఛన్లు, స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలివ్వాలని రజక వృత్తిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉస్సో.. ఉస్సో.. ఉస్సో అంటూ ఊపిరి ఎగబోస్తూ చాకిరేవు బండమీద బట్టలుతికే రజకుల బతుకులపై యాంత్రీకరణ ప్రభావం తీవ్రంగా పడింది. వాషింగ్ మిషన్లు వచ్చాక బట్టలుతికే పని లేకుండా పోయింది. చీరలు, ప్యాంటు, షర్ట్స్, యూనిఫామ్స్ మాత్రమే కాకుండా దుప్పట్లు, బొంతలు, టవల్స్, డోర్కటన్స్ వంటివి ఉతికే పని కూడా లేకుండా పోయింది. చావు, పురుడు వంటి మైల బట్టల్ని మాత్రం రజకులతోనే ఉతికిస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలో 450 రజక కుటుంబాలుంటే అందులో వంద కుటుంబాలు కూడా కుల వృత్తి చేయట్లేదు. అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులున్నారు. బట్టలు ఉతికే పని తగ్గడంతో ఊర్లల్లో కూలి పనులు చేయడం.. లేదంటే పట్టణాలకు వలసెళ్లి నిర్మాణ రంగం, కంపెనీల్లో వాచ్మెన్ తదితర పనులు చేస్తున్నారు.
బండ చాకిరీ..
రజకులు మాసిన బట్టల మూటలు తీసుకుని చాకిరేవుకెళ్తారు. పొద్దున 7 గంటలకెళ్లి బట్టల మూటలన్నీ ఉతికే జాడిచ్చే సరికి మధ్యాహ్నం 2 గంటలవుతోంది. బట్టలు ఆరాక ఇంటికి తీసుకొచ్చి ఇస్త్రీ చేయాలి. ఇలా రెండ్రోజులు అదే పనిగా చేస్తే జత బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తే రూ.40 రూపాయలిస్తారు. ఉతికిస్తే జతకు రూ.20 ఇస్తారు. 20 జతల బట్టల్ని ఉతికితే రూ.400 ఆదాయం, ఇస్త్రీ కూడా చేస్తే రూ.800 ఆదాయం వస్తది. అంటే సగటున రోజంతా బండ చాకిరీ చేసినా రూ.400 కూలే దక్కుతుంది. అందులోంచి చాకిరేవుకెళ్లేందుకు లూనా లాంటి మోటార్ సైకిల్ ఉంటే పెట్రోల్, సబ్బులు, సర్ఫ్ ఖర్చులు పోగా రూ.200 మిగలని పరిస్థితి. అడ్డామీద కూలీ పనికెళ్లితే కనీసం రూ.800 ఇస్తారు.
చర్మవ్యాధులు, వెన్నుపూస జబ్బులు
చాకిరేవులో బట్టలుతికే రజకులు రోగాల పాలవుతున్నారు. నీళ్లల్లో నిలబడి, వంగబడి బట్టల్ని ఉతకాలి. బట్టలు జాడించి ఆరేయాలి. ఈ పనులన్నీ వంగి ఉండే చేయాలి. చెరువులు, కుంటల్లో నీళ్లన్నీ మురికి మయమయ్యాయి. నీళ్లల్లో నిలుచుండి బట్టలుతకడం వల్ల కాళ్లకు పగుళ్లు వచ్చి చిట్లుతిన్నాయి. మురికి నీళ్లన్నీ ఒంటిమీద పడటం, డిటర్జెంట్స్ వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయి. శ్వాసకోశ, దద్దుర్లు, దురద, గజ్జి వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి.
సంప్రదాయ పనుల పేర వెట్టి
రజక వృత్తిదారులు బట్టలుతకడం, ఇస్త్రీ చేయడమే కాకుండా సంప్రదాయక పనులు కూడా చేస్తున్నారు. గ్రామం, పట్టణాల్లో ఇండ్లను వారు వంతుల వారీగా పంచుకుంటారు. వారి పరిధిలోకి వచ్చే కుటుంబాలకు వారే బట్టలుతకడం, సంప్రదాయ సేవలు అందిస్తారు. ఎవరింట్లో అయినా వ్యక్తి చనిపోతే.. ఆ ఇంటిని చూసే రజక కుటుంబమే వెళ్లి కుండ తేవడం, శవం ఉంచే ప్రాంతంలో గడ్డివేయడం, దీపం పెట్టడం, అంత్యక్రియలయ్యాక ఆ ఇల్లంతా శుభ్రం చేయడం, మైల బట్టల్ని ఉతకడం వంటి పనులు చేస్తారు. ప్రసవం జరిగిన ఇంట్లో కూడా బాలింత, పిల్ల మైల బట్టలుతుకుతారు. ఇన్ని పనులు చేసినా భార్యాభర్తలకు కలిపి రూ.500 చేతిలో పెట్టి పంపుతారు. ఇటువంటి పనులకు ఇచ్చినంత తీసుకోవడం తప్ప డిమాండ్ చేసే పరిస్థితి ఉండదని పలువురు వృత్తిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంటోళ్ల కొరడా..
లాండ్రీషాపు, దోబీఘాట్స్, డ్రైక్లీనర్స్ నడిపే రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నారు. క్షౌరవృత్తిదారుల సెలూన్లు, రజకుల లాండ్రీ దుకాణాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం బకాయిల్ని చెల్లించడంలో శ్రద్ద చూపట్లేదు. ఫలితంగా కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీటర్లను తనిఖీ చేసి బిల్లుల్ని బలవంతంగా వసూలు చేస్తున్నారు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని అనేక గ్రామాలు, మండల, పట్టణ కేంద్రాల్లో ఇప్పటికే కరెంట్ బిల్లులు కట్టించుకున్నారు. ఇదేమిటని అడిగితే ప్రభుత్వం నుంచి బకాయిలు రావట్లేదని, బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్‌చేస్తామని చెబుతున్నారు. సంగారెడ్డి పట్టణంలో రజక వృత్తిదారుడు హెచ్.రాజు ఇస్త్రీ షాప్‌కు రూ.460 కరెంట్ బిల్లులు వస్తే కట్టే వరకు ఒత్తిడి చేశారు. కనెక్షన్ కట్ చేస్తే ఇస్త్రీ పని ఆగిపోవడం, మళ్లీ కనెక్షన్ ఇవ్వాలంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే భయంతో బిల్లులు కడుతున్నట్టు పలువురు వృత్తిదారులు చెబుతున్నారు.
రజకులపై సామాజిక వివక్ష
రజకులపై సామాజిక వివక్ష కొనసాగుతోంది. ఇప్పటికీ రేట్లు పెంచమని అడిగితే గ్రామ బహిష్కరణ చేస్తుండ్రు. దాడులు చేస్తుండ్రు. కులం పేరుతో పిలిచి అవమానిస్తుండ్రు. వేలాది కుటుంబాలకు వృత్తి పనిలేకుండా పోయింది. కంపెనీలు, ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో వాచ్మెన్, ఇతర పనులు చేస్తూ బతుకుతున్నరు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ బకాయిలు చెల్లించాలి. వృత్తిదారులకు కరెంట్ కట్ చేయకుండా, బిల్లులు అడగకుండా విద్యుత్ అధికారులకు ఆదేశాలివ్వాలి. డబుల్ బెడ్ రూం ఇండ్లు, 50 ఏండ్ల వారికి పింఛన్లు, వంద శాతం సబ్సిడీ రుణాలు, రజక బంధు వంటి పథకాల్ని అమలు చేయాలి.
- హనుమంతు రజకవృత్తిదారుల సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
చాకిరీ చేస్తం
ముప్పై ఏండ్ల నుంచి బట్టలుతుకుతున్న. నేను నాభార్య ఇద్దరమిదే పనిచేస్తం. ఒకప్పుడు వందలాది ఇండ్ల బట్టలుతికేది. ఇప్పుడు మిషన్లు వచ్చాక ఓ ఐదారు ఇండ్ల బట్టలే ఉతుకుతం. పొద్దున చాకిరేవుకు పోతే సాయంత్రం ఇంటికొస్తం. మరుసటి రోజంతా ఇస్త్రీ చేసి ఇస్తే జతకు రూ.30-40 వరకే ఇస్తరు. నా వంతుకొచ్చిన ఇండ్లల్లో చావైనా పెళ్లైనా పురుడొచ్చినా మేమెళ్లి పనులు చేస్తం. వాళ్లిచ్చినంత తీసుకోవాలి. ఇస్త్రీ డబ్బాకు రూ.450 బిల్లు కట్టించుకుండ్రు. కట్టకపోతే విద్యుత్ కనెక్షన్ కట్చేస్తమన్నరు. ప్రభుత్వం ఉచితమంటది. కరెంటోళ్లొచ్చి బిల్లు వసూలు చేస్తుండ్రు. మాకిద్దరు ఆడపిల్లలు. నా భార్య అనారోగ్యం పాలైంది. బట్టలుతికితే తప్ప పూట గడవట్లేదు. ప్రభుత్వం మాకు డబుల్బెడ్రూం ఇల్లు, పింఛన్లు ఇవ్వాలి.
- హెచ్.రాజు- సంగారెడ్డి