Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు ద్రోహం చేసిన ప్రధాని మోడీ
- కనీస మద్దతు ధర, ఏకకాల రుణమాఫీ చేయాల్సిందే...
- స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి
- భూముల్ని కార్పొరేట్లకు కట్టబెడ్తే ఊరుకోం... : తెలంగాణ రైతు సంఘం బహిరంగసభలో ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్‌మొల్లా
నల్గొండ నుంచి ఎస్ఎస్ఆర్ శాస్త్రి
దేశంలోని రైతాంగం మరో సంఘటిత పోరాటానికి సిద్ధం కావాలని అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్‌మొల్లా పిలుపునిచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసుకున్నాక, ప్రధాని నరేంద్రమోడీ మరోసారి భారతదేశ రైతాంగాన్ని మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నల్ల చట్టాల రద్దు సమయంలో కనీస మద్దతు ధర చట్టం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్)కు కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రెండేండ్లు అవుతున్నా, ఇప్పటికీ దాని ఊసే ఎత్తట్లేదన్నారు. ఈసారి ఢిల్లీని నిర్భంధించడం కాకుండా, అన్ని రాష్ట్రాల్లోని రాజధానుల్లో గవర్నర్ కార్యాలయాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామన్నారు. రాజ్భవన్ల ముట్టడితో ఇది ప్రారంభమైందనీ, భవిష్యత్‌లో మరింత ఉధృతి అవుతుందని చెప్పారు. తెలంగాణ రైతు సంఘం ద్వితీయ రాష్ట్ర మహాసభలు ఆదివారం నల్గొండలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మేకల అభినవ్ స్టేడియం నుంచి నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరిగింది. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అధ్యక్షతన జరిగిన సభలో హన్నన్‌మొల్లా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 87 ఏండ్ల ఏఐకేఎస్ సుదీర్ఘ రైతాంగ పోరాట ప్రస్థానాన్ని గుర్తుచేశారు. 75 ఏండ్ల స్వాతంత్య్రానంతరం కూడా ఇంకా భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. దేశంలో రైతుల దుస్థితికి పాలకులు అవలంబిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలే కారణమని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఐఎమ్ఎఫ్, వరల్డ్‌బ్యాంక్, డబ్ల్యూటీఓ ఒప్పందాల అమలును దేశ రైతాంగంపై బలవంతంగా రుద్దుతున్నారని వివరించారు. రైతుల భూముల్ని అక్రమంగా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాము భూ సంస్కరణలు, భూ పంపిణీ కోసం ఎరుపు విప్లవం తేవాలని భావిస్తే, పాలకులు హరిత విప్లవం తెచ్చారనీ, దీనివల్ల ఉత్పాదకత పెరిగి రైతులకు మరిన్ని కష్టాలను మిగిల్చిందన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో కార్పొరేట్ కాంట్రాక్ట్ వ్యవసాయానికి గ్రీన్ సిగల్ ఇచ్చిందనీ, ఇది క్రమేణా చిన్న రైతుల్ని కూలీలుగా మార్చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ విధానాల వల్ల దేశంలో నాలుగు లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఇప్పటికీ రోజుకు 50 మంది ఇలాగే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వివరించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని నరేంద్రమోడీ ప్రధాని కాకముందు 400 బహిరంగ సభల్లో ప్రజలకు హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పేర్కొన్నదని చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాక ఆ హామీని మర్చిపోయారనీ, అదానీ, అంబానీలు ఇచ్చే నోట్ల అమలుకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో రైతాంగ పోరాటం సందర్భంగా తాము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలేమని నిస్సిగ్గుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, ఆ తర్వాత కార్పొరేట్ల పాట పాడుతూ ప్రజల్ని ప్రధాని నరేంద్రమోడీ మోసం చేస్తున్నారని చెప్పారు. కార్పొరేట్ల కోసం విద్యుత్ సవరణ చట్టం, భూసేకరణ చట్టం తెచ్చారనీ, రైతాంగం, దేశ ప్రజలు కోరుతున్న కనీస మద్దతు ధర చట్టంపై ముఖం చాటేస్తున్నారని అన్నారు. కేరళలోని త్రిసూర్‌లో ఏఐకేఎస్ 35వ జాతీయ మహాసభలు జరగనున్నాయనీ, అక్కడ తెలంగాణ రైతాంగ సమస్యలతో పాటు దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై కూలకషంగా చర్చించి, కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రజలు ఏఐకేఎస్, ఎస్కేఎమ్ పిలుపుల మేరకు ఆందోళనల్లో భాగస్వాములు కావాలని కోరారు.
పోరాటాలే శరణ్యం
మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
పోరాటాల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఏరంగంలో లేనన్ని ఆత్మహత్యలు వ్యవసాయరంగంలోనే జరుగుతున్నాయనీ, వీటిని ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని చెప్పారు. పాలకుల విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి అనేక హామీలు ఇచ్చిందనీ, వాటి అమలు కోసం తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వం రైతాంగ సమస్యలపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. కేరళ రాష్ట్రం ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నదనీ, అక్కడి రైతాంగానికి కేంద్ర మద్దతు ధరలకు అదనంగా మరో వెయ్యి రూపాయలు ఇస్తున్నదని తెలిపారు. ప్రజల కష్టాలు పట్టని కేంద్రం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట్ల ప్రభుత్వాలను ఎలా కూలగొట్టాలో కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. ఎనిమిదిన్నరేండ్ల మోడీ పాలనలో ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క పనీ లేదనీ, దేశ రైతాంగం కష్టపడి పనిచేస్తే, వారి ఆదాయం రెట్టింపు ఏమో కానీ, కష్టాలు మాత్రం రెట్టింపు అయ్యాయని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్లు దేశాన్ని లూటీ చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ధరణి అవకతవకలు సరిదిద్దాలనీ, పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలనీ, కేరళ తరహాలో రైతుల పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతు సంఘం ప్రధానకార్యదర్శి టీ సాగర్ మాట్లాడుతూ మోడీ హయంలో వ్యవసాయం, రైతాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సంపద సష్టించే వారికి మొండిచేయి చూపుతూ, కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని విమర్శించారు. రూ.40 లక్షల కోట్ల బడ్జెట్లో కీలకమైన వ్యవసాయ రంగానికి కేవలం రూ.1.24 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. రైతులను ఆదుకోవడానికి బలమైన ఉద్యమాలు రావాలనీ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చేందుకు విశాల ఐక్యవేదికలు మరింత బలంగా పని చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జూ కృష్ణన్, ఆహ్వానసంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు బొంతల చంద్రారెడ్డి, రైతు మహిళా కన్వీనర్ కందాల ప్రమీల, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి,, అరిబండి ప్రసాదరావు, రైతుసంఘం నల్గొండ జిల్లా అద్యక్ష, ప్రధాన కార్యదర్శి వీరపల్లి వెంకటేశ్వర్లు, కూన్‌రెడ్డి నాగిరెడ్డితదితరులు పాల్గొన్నారు.