Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుళత్వ భావనా... హిందూరాష్ట్ర భావనా?
- విభజన ఆలోచనలొద్దు...సమైక్యత కోసం పోరాటం తప్పదు
- టెకీస్ ఫర్ ఎ బెటర్ ఇండియా కార్యక్రమంలో సీతారాం ఏచూరి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'దేశం ప్రమాదంలో పడింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు దామోదర్ సావర్కర్ ప్రతిపాదించిన హిందూ రాష్ట్ర భావనను శరవేగంగా అమలు చేస్తున్నది. వ్యవస్థలన్నింటిలోనూ ఆ ఆలోచనలు జొప్పిస్తున్నది. లౌకికభావన స్థానంలో మెజారిటీ హిందూ రాష్ట్ర భావనను తీసు కొస్తున్నది. మనుషులను మనుషులుగా గుర్తించకుండా మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన చూసే ధోరణి పెరిగిపోతున్నది. రాజ్యాంగానికి మూలస్థంభాలుగా ఉన్న లౌకికవాద ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, సమాఖ్య భావనలు ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయి....' అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు.
టెకీస్ ఫర్ బెటర్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ది ఐడియా ఆఫ్ ఇండియా అనే అంశంపై ఆదివారం ఆయన ప్రసంగించారు. గతంలో యూరోపియన్ దేశాల్లో మెజారిటీవాదమే జాతీయవాదంగా చెలామణి అయ్యేదనీ, ప్రస్తుతం భారతదేశంలో ఆ పరిస్థితిని చూస్తున్నామని ఈ సందర్భంగా ఏచూరి తెలిపారు. ఈ జాతీయవాదాన్ని ఆసరా చేసుకున్న వారికి దాన్ని నిలబెట్టుకోవడానికి దేశంలోనే అంతర్గతంగా శతృవు అవసరమ య్యారు. అందుకోసమే దేశంలోని అల్పసంఖ్యాక వర్గాల వారిని మెజారిటీ ప్రజలకు శతవులుగా చిత్రీకరించడం ప్రారంభించారు. 1960లలో ఈ పరిస్థితి ఉండేది కాదు. మన దేశానికి ఉన్న బహుళత్వం, వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా మనం చూడం. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటానికి కొనసాగింపుగా సోషలిజం, ఆర్థిక స్వాతంత్య్రం కోసం పోరాటం చేయాల్సి ఉన్నదని తెలిపారు. దేశ చరిత్రలో రెండు భావనలు ముందుకొచ్చాయని వివరించారు. దామోదర్ సావర్కర్, మహమ్మద్ అలీ జిన్నాలు ఒక దేశంలో రెండు దేశాల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. హిందూ రాష్ట్ర భావనను ఆర్ఎస్ఎస్ ముందుకు తెస్తే, ముస్లీంలీగ్ జిన్నా రెండేండ్ల తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్‌ను ఎత్తుకున్నాడు. 1947లో పాకిస్తాన్ మతప్రాతిపదికన ఏర్పడితే, భారతదేశ ప్రజలు సెక్యులర్‌గా ఉండేందుకే ఇష్టపడి హిందూ రాష్ట్ర భావనను తిరస్కరించారు. హిందుత్వ అంటే హిందువులకు మాతృభూమి, పితృభూమి, పుణ్యభూమి అనీ, ముస్లీంలు, క్రైస్తవులు వేరే వారని అర్థం. అయితే భారతదేశ భావన ఇందుకు భిన్నమైనది. ఆ భావన రాజ్యాంగ మూలస్థంభాలుగా ఉన్నవాటిలో ప్రస్ఫుటమైందని తెలిపారు.
రాజ్యాంగాన్ని కాదనీ, ప్రత్యేక వివాహ చట్టంపై వివాదం రేపారని పేర్కొన్నారు. లవ్ జిహాద్ పేరుతో భిన్న విశ్వాసాలను అనుసరించే వారి మధ్య వివాహాలను నిషేధిస్తూ ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు చట్టాలను చేస్తున్నాయి. దానిని శిక్షార్హమైన నేరంగా మార్చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ప్రతి దాన్ని ప్రయివేటీకరిస్తూ కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు.ఎలక్టోరల్ బాండ్ల పేరుతో రాజకీయ అవినీతికి తెరలేపారు. దళితులు, మహిళపై దాడులు పెరిగాయి. గిరిజన హక్కులను హరించేలా వనరులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. కేంద్ర-రాష్ట్రాల మధ్య సంబంధాలకు సంబంధించి రాజ్యాంగం ఇచ్చిన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు ఆక్షేపణీయంగా ఉంది. గవర్నర్లంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారులుగా ఉండాలని ఏచూరి ఈ సందర్భంగా సూచించారు.
స్వతంత్ర సంస్థలేవి?
రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా పని చేయాల్సిన సంస్థలు, వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంపైనే పెద్ద యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించకపోతే ఇక ప్రజాస్వామ్యమెక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐల పరిస్థితి చెప్పనక్కర్లేదు. చిన్నప్పుడు పడుకోకుంటే రాక్షసులొస్తారని భయపెట్టేవారు. ఇప్పడు ఈడీ వస్తుందని భయపెట్టే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఈ సంస్థలు నమోదు చేస్తున్న కేసుల్లో 90 శాతం వాటిలో ఏమి తేలదనీ, అప్పటికీ ఐదారేండ్లు గడిచిపోతాయని వ్యాఖ్యానించారు.
అందరూ సమానమే...
భారతదేశం అంటే అందరూ సమానమేననీ, సమానమంటే దేశంలోని వనరులు అందరికి దక్కాలన్నారు. సాంకేతికతక కూడా అందరికి సమానంగా అందుబాటులో ఉండాల్సిందేనని చెప్పారు. సమానత్వమంటే కేవలం భౌతిక సమానత్వమే కాదనీ, మేధోపరమైన సమానత్వం కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశంలో 54 శాతం మంది 25 ఏండ్లలోపు వారున్నారనీ, వారంతా జ్ఞానవంతులైతే ఈ దేశాన్ని అగ్రగామి కాకుండా ఆపే శక్తి ఎవరికి లేదన్నారు. అసమానత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసే ఇండియాకావాలా? విద్య, ఆరోగ్య సౌకర్యాలు, ఉద్యోగవకాశాలిచ్చే ఇండియా కావాలా? అని ప్రశ్నించారు. అందరికి విద్య, ఉద్యోగం అవసరమని తెలిపారు. భవిష్యత్ ఇండియా ఎలా ఉండాలో యువత చేతుల్లోనే ఉందనీ, భారతదేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయవాదం,, మతం వేర్వేరని తెలిపారు. మతం వ్యక్తిగతమైందన్నారు.
నేనెవర్ని? నా కొడుకు మతమేది?
నేను తెలుగువాడిని. చెన్నై, బెంగాల్ మీదుగా ఢిల్లీ వరకు నా ప్రయాణం కొనసాగింది. మతం, ప్రాంతం, కులం ప్రాతిపదికనే గుర్తింపునిచ్చే వారినుద్దేశించి నన్నవెరంటారంటూ ఏచూరి ప్రశ్నించారు. సూఫీ మతానికి చెందిన తండ్రి, మైసూర్ రాజవంశానికి చెందిన తల్లికి జన్మించిన స్త్రీని నేను వివాహం చేసుకున్నాను. నాకు జన్మించిన కుమారుడి మతమేదంటూ ఆయన ప్రశ్నించారు. ఆకలి, నిరుద్యోగం కన్నా తమకు మతమే సుప్రీం అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, అసలు మనిషే జీవించి ఉండకపోతే మతంతో పనేముంటుందని ప్రశ్నించారు.