Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలి
- మున్సిపల్ శాఖ అభివృద్ధి పనులపై సమీక్షలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ అధికారులు ఏరోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించి పనిచేస్తేనే గుణాత్మక మార్పు సాధ్యమవుతుందనీ, ప్రజలకు మరింత చేరువవుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సమిష్టితత్వంతో సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయన్నారు. స్వరాష్ట్రంలో ప్రజలఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టండంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషి ఇమిడి వున్నదని కొనియాడారు. ప్రతి పనినీ ఎంత శాస్త్రీయఆలోచనతో చేస్తున్నామనేది ముఖ్యమని చెప్పారు. మూస ధోరణులు, సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా వినూత్న ఆలోచనలతో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులు, నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, సుందరంగా తీర్చిదిద్దడం వంటి అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేని సందర్భాల్లోంచి నేడు అన్ని రంగాల్లో గుణాత్మకాభివృద్ధిని తెలంగాణ సాధించిందన్నారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు ప్రజల అనుభవంలోకి వచ్చాయన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గుణాత్మక ప్రగతిని సాధించిందనీ, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పారు. పౌర సౌకర్యాల పెంపుకోసం రోజు రోజుకూ డిమాండు పెరుగుతుందనీ, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని సీఎం అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాలిన అవసరమున్నదన్నారు. గతంలో ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానాలు, తదితర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా ఉంటున్నాయన్నారు. దాదాపు 30 లక్షల మంది పక్క రాష్ట్రాలనుంచి తెలంగాణకు వలసవచ్చి బతుకుతున్న పరిస్థితి నెలకొందన్నారు. వర్షాల నేపథ్యంలో ఏటా ఆరేడు నెలలకాలంలోనే అభివృద్ధి పనులను పూర్తిచేసుకోవాల్సి ఉందన్నారు.
నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలె: సీఎం కెసీఆర్
ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖ, తదితర అన్ని శాఖలు సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా పనుల్లో నిమగం కావాలని స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాలకు సూచించారు. ఇప్పటికే విడుదలైన నిధులతో పాటు నిజామాబాద్ నగరాభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.
ఖమ్మంలో జరిగిన అభివృద్ధి పరిశీలించి రావాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌లోని దోబీఘాట్లు, సెలూన్లను అంచనావేసి మోడ్రన్ దోబీఘాట్లను నిర్మించాలన్నారు. నిజామాబాద్ నగరంలో గార్డెన్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిన్నతనంలో తాను తరుచూ వెళ్లి కూర్చున్న తిలక్ పార్కును గుర్తుకు చేసుకున్నారు. ఆ గార్డెన్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను సుందరీకిరించాలన్నారు. ఆ నగరంలోని ప్రభుత్వ భూములను గుర్తించాలనీ, ప్రజల అవసరాలకు ఉపయోగించేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. పాత ప్రభుత్వ కార్యాలయాలను ఎలా వాడుకోవాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ వివరించారు. నిజామాబాద్‌లో ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన వివరాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. నగరాభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్సీ కవిత సీఎంను అభ్యర్థించారు. బస్టాండ్, క్రీడాప్రాంగణం గురించి వివరించారు. హజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని సీఎం కోరారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ ఉన్నత, జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.