Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కసారి పెన్ను పడితే ప్రాణం పోయేదాకా వదలరు...
- మీడియా ప్రతిపక్ష పాత్రను పోషించాలి :టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర రెండో మహాసభలో మంత్రి వి.శ్రీనివాసగౌడ్
- భవిష్యత్తు మరింత ప్రమాదకరం : తమ్మినేని
- పాత్రికేయులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి : ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్
- మహాసభకు పెద్ద సంఖ్యలో హాజరైన జర్నలిస్టులు
- సుందరయ్య పార్కు నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకూ భారీ ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జర్నలిస్టులు... సమాజంలోని పీడిత ప్రజల తరపున నినదించే గొంతుకలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యానించారు. జీవితంలో ఒక్కసారి పెన్ను పట్టిన పాత్రికేయుడు... ప్రాణం పోయేదాకా దాన్ని వదలబోడని ఆయన తెలిపారు. దేశం అత్యంత సంక్లిష్ట, సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో... మీడియా ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన అవసముందని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర రెండో మహాసభను ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్లింగంపల్లిలోగల ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సుందరయ్య పార్కు నుంచి కళాభవన్ వరకు పాత్రికేయులు భారీ ప్రదర్శన నిర్వహించారు. 'వర్థిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, పరిష్కరించాలి.. జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. జిందాబాద్ టీడబ్ల్యూజేఎఫ్, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలనివ్వాలి...' తదితర నినాదాలతో ర్యాలీని ఆసాంతం వారు హోరెత్తించారు. ప్రదర్శన కళాభవన్‌కు చేరుకున్న అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఫెడరేషన్ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ సభలో శ్రీనివాసగౌడ్ ముఖ్య వక్తగా మాట్లాడుతూ... జర్నలిస్టు అనేవాడు ఒక వ్యక్తి కాదనీ, అతడు ఒక సమూహ శక్తి అని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో పాత్రికేయులు క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సమాజాన్ని మార్చేందుకు, ప్రజలకు సేవలకు చేసేందుకోసమంటూ అనేక మంది జర్నలిజాన్నే తమ కేరీర్‌గా ఎంచుకుంటున్నారని వివరించారు. అయితే ఆ విధంగా ఎంచుకుని ఈ వృత్తిలోకి వస్తున్న స్థానిక, మండల, జిల్లా విలేకర్లు, కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే సీనియర్ జర్నలిస్టుల జీవితాలు, వారి జీవన ప్రమాణాలు చాలా దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పరిస్థితి... 'ఊపర్ శేర్వాణీ.. అందర్ పరేషానీ...' అన్నట్టుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కడివెడు పాలల్లో ఒక్క బొట్టు విషం చుక్క పడ్డట్టు కొంత మంది బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎల్లో జర్నలిజం వల్ల సమాజానికి మంచి జరక్కపోగా.. కీడు జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి రుగ్మతల నుంచి జర్నలిస్టులు, మీడియా రంగం బయటపడాలని ఆయన ఆకాంక్షించారు. మహాసభకు వక్తగా హాజరైన సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ...నిజాం నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా పోరాడి బలైన ఆనాటి జర్నలిస్టు షోయబుల్లాఖాన్ వారసులుగా సమస్యలపై పోరాడాలని పాత్రికేయులకు పిలుపునిచ్చారు. వార్తను రాయటం, వక్రీకరించటంతోపాటు వార్తలు, కథనాలను ఉత్పత్తి చేయటం ఇప్పుడు రివాజుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు విషయం చుట్టూ మీడియా తిరిగేది.. ఇప్పుడు మీడియా చుట్టూ విషయం తిరుగుతుండటం శోచనీయమన్నారు. కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో పత్రికలు, ఛానెళ్లు నడుస్తున్న నేటి తరుణంలో భవిష్యత్తులో జర్నలిస్టుల పరిస్థితి ఇప్పుడున్న దానికంటే మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బంధం, అణచివేత పెరగనుందని వివరించారు. ఈ క్రమంలో జర్నలిస్టులు మరింత సంఘటితమై తమ హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వారికి సీపీఐ (ఎం) అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రజలే కేంద్రంగా, వారి జీవితాలే కథాంశాలుగా వార్తలు రాయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మాధ్యమాల విస్తరించిన నేపథ్యంలో నేటి జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ సూచించారు. లేదంటే వారి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు.కోవిడ్ అనంతరం డిజిటల్ మీడియా శరవేగంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు ప్రజలపై ప్రభావం చూపలేకపోతున్నాయని వివరించారు. కాలక్రమంలో అవి అంతర్థానమై పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. అందువల్ల జర్నలిస్టులు తమ హక్కుల సాధనతోపాటు డిజిటల్ మీడియాకు సరిపడా నైపుణ్యాలను, సామర్థ్యాలను అందింపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి.ఆంజనేయులు, ఎన్‌ఎఫ్‌డబ్ల్యూజే నేత శాంతకుమారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మెన్ తిరుమలగిరి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య కార్యకలాపాలపై నివేదిక (కార్యదర్శి నివేదిక)నిచ్చారు. ఇటీవల మరణించిన పలువురు జర్నలిస్టులు, ఇతర రంగాల ప్రముఖులకు సంతాపం తెలుపుతూ మధుకర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వివిధ పత్రికల్లోని పలువురు జర్నలిస్టులను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జాతీయ నాయకులు పి.ఆనందం, రాష్ట్ర నాయకులు పిల్లి రాంచందర్, ఆర్.వెంకటేశ్వర్లు, ఈ.నర్సింగరావు, ఎస్కే సలీమా, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్‌కుమార్, బి.జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.సోమయ్య, బి.బసవపున్నయ్య
- ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం హైదరాబాద్‌లో ఫెడరేషన్ ద్వితీయ రాష్ట్ర మహాసభ జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్యను మహాసభ ఎన్నుకున్నది. కోశాధికారిగా ఆర్.వెంకటేశ్వర్లు ఉండనున్నారు. 27 మంది ఆఫీస్‌బేరర్లు, 53 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. మహాసభ కార్యవర్గాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరుమలగిరి సురేందర్, బీఆర్కే మూర్తి ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా పి.ఆనందర, పి.రామచందర్, వై.ప్రభాకర్, టి.కృష్ణ, గుడిగ రఘు, బి.రాజశేఖర్, రాధిక, విజయానం దరావు, జగన్, మాణిక్‌ప్రభు, బండి విజరుకుమార్, రాష్ట్ర కార్యదర్శులుగా నర్సింగ్‌రావు, ఎస్కే.సలీమా, దామోదర్, గండ్ర నవీన్, బి.జగదీశ్వర్, కె.నిరంజన్, ఈ. చంద్రశేఖర్, తన్నీరు శ్రీనివాస్, దయాసాగర్, కర్రా అనిల్‌రెడ్డి, భిక్షపతి, కె.వివేకానంద, కె.వెంకటేశ్ ఎన్నికయ్యారు.