Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విధానంతో విద్యారంగం కార్పొరేట్ పరం
- ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల పోస్టర్ అవిష్కరణలో విద్యావేత్త చుక్కా రామయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల పోస్టర్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజుతో కలిసి ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన విద్యావిధానంతో ఆ రంగంలో తీవ్ర అసమానతలు పెరిగే అవకాశముందన్నారు. దేశ భవిష్యత్‌ను నిర్దేశించేది విద్యార్థులేనని చెప్పారు. వారిని సరైన మార్గంలో నడిపించటమంటే..సమాజం పట్ల వాస్తవిక ధృక్పధాన్ని అందించటమేనని తెలిపారు.. ఆర్ఎల్ మూర్తి, నాగరాజు మాట్లాడుతూ డిసెంబర్ 13నుంచి 16 వరకు హైదరబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో భారత విద్యార్థి ఫెఢరేషన్ (ఎస్ఎఫ్ఐ) జాతీయ 17 వ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. దేశ వ్యాప్త విద్యార్థి ఉద్యమాలకు ఈ సభల్లో రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో విద్య, ఉపాధి రంగాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. యూనివర్శీటీలకు తగిన నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. భారీగా ఫీజులు పెంచి పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నదని చెప్పారు. విద్యారంగంలో కాషాయికరణ, వ్యాపారీకరణ, కార్పోరేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. నూతన విద్యావిధానం పేరుతో ఆరెస్సెస్ భావాజాలన్ని విద్యలో ప్రవేశపెట్టి సిలబస్ మార్చివేసి, చరిత్రను వక్రీకరిస్తుందని చెప్పారు. ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకుండా ఉండడం ద్వారా అణాగారిన వర్గాలకు ఈ విద్యాసంస్థల్లో స్థానం లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తులను యూజీసీ చైర్మెన్‌గా నియమించి యూనివర్శీటీల్లో ప్రజాస్వామిక వాతవరణాన్ని లేకుండా చేస్తున్నదని విమర్శించారు. 29 రాష్ట్రాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రజినీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.