Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజాభివృద్ధిలో మీడియాదే ఎక్కువ బాధ్యత : టీడబ్ల్యూజేఎఫ్ మహాసభలో వీహెచ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మీడియాలో ముఖాలను చూసి కాకుండా వార్తాంశానికి ప్రాధానత్య ఇవ్వాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కోరారు. కొందరికేమో పేజీలో సగం ప్లేసు కేటాయిస్తూ నచ్చనోళ్ల విషయంలో సింగిల్ కాలమ్ వార్త కూడా రాయకపో వడం అన్యాయమన్నారు. సమాజాభివృద్ధి లో మీడియాదే ఎక్కువ బాధ్యత అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర రెండో మహాసభకు వీహెచ్ హాజరై మాట్లాడారు. చిన్నచిన్న పత్రిల ద్వారా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పారు. నేడు మీడియా యాజమాన్యాల వైఖరి పూర్తిగా మారిందన్నారు. మేనేజ్మెంట్లు కోటీశ్వర్లు అయితుంటే మరోవైపు నూటికి 80 శాతం జర్నలిస్టులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని చెప్పారు. ఇదే సందర్భంలో జీతాల్లేక కొంత మంది జర్నలిస్టులు పెడదోవ పడుతున్నారనీ, దీనికి యాజమాన్యాలే కారణమని విమర్శించారు. ప్రభుత్వాలను నడిపించాల్సిన పత్రికలు..నేడు ప్రభుత్వాలు ఏది చెబితే అది చేస్తున్నాయని వాపోయారు. నూటికి 90 శాతానికిపైగా పత్రికా యజమానులు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూర్చోమంటే కూర్చుంటున్నరు...లేమ్మంటే లేస్తున్నరు అని విమర్శించారు. తమ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న జర్నలిస్టుల బాగోలును చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి మూడు, నాలుగేండ్లకోసారి ప్రభుత్వాలు ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టే..పత్రికా యాజమాన్యాలు జీతాలు పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు.