Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్. వినయకుమార్
- ఘనంగా పిల్లల పండుగ
నవతెలంగాణ ముషీరాబాద్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకెే) అధ్వర్యంలో 'సాంస్కృతిక ఉత్సవం- పిల్లల పండుగ'ను ఆదివారం ఉత్తేజంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 హైస్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు. చిత్ర లేఖనం, వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించారు. అలాగే దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు, ఆట, పాటలతో పిల్లలు సందడి చేశారు. ఈ సందర్భంగా హాజరైన కొత్తగూడెం బాలోత్సవం వ్యవస్థాపకులు డా|| రమేష్‌బాబు మాట్లాడుతూ.. పిల్లల్లో సామాజిక చైతన్యం పెరగడానికి పిల్లల పండగలు ప్రతి జిల్లాలో జరపాలని, ఇలాంటి కార్యక్రమాలకు తాము తోడుగా ఉంటామని తెలిపారు. ఎస్వీకే కార్యదర్శి ఎస్. వినయకుమార్ మాట్లాడుతూ.. రేపటి పౌరుల ఉత్సాహ, విజ్ఞాన వేదిక పిల్లల పండగ అని అన్నారు. చదువులు, ర్యాంకులు, పరుగులు, వీడియో గేములు, కంప్యూటర్లు ఇవి మాత్రమే కావని, కూసింత శాస్త్రీయ ఆలోచనను రేకెత్తించే వారి ప్రతిభా పాటవాలను అవలీలగా ప్రదర్శించే వేదికలను ప్రోత్సహించాలని సూచించా రు. ఇలాంటి పిల్లల పండగ నిరంతరం యజ్ఞంలా నిర్వహిస్తామని చెప్పారు.విజ్ఞాన శాస్త్రవేత్త, ప్రముఖ రచయిత దేవరాజు మహారాజు మాట్లాడుతూ...ఇది బాలోత్సవం కాదు, పిల్లల సృజనోత్సవం అన్నారు. విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు టి. రమేష్ విజ్ఞాన వైజ్ఞానిక సైన్స్ ప్రదర్శన నిర్వహించి మూఢ విశ్వాసాల గురించి చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాధ్యులు జి. బుచ్చిరెడ్డి అందరికీ స్వాగతం పలికారు. పిల్లల పండుగ నిర్వహణ కమిటీ ఎన్. సోమన్న, తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం నాయకులు భూపతి వెంకటేశ్వర్లు సమన్వయం చేశారు. కార్యక్రమంలో వాసిరెడ్డి రమేష్ బాబు రచించిన 'నది లాంటి మనిషి' పుస్తకాన్ని దేవరాజు మహారాజు ఆవిష్కరించారు. విజేతలకు బహుమతులు సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు.