Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన్మ హక్కును నిర్వీర్యం చేస్తే సమాధి చేస్తాం
- గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవ తెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నో దశాబ్దాలుగా కార్మికులు, కర్షకులు పోరాడి సాధించుకున్న హక్కులను నీరు గార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని, కార్మికులు సంఘటితమై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 4వ మహాసభల ప్రతినిధుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఐటీయూ నిర్వహించిన ప్రజా పోరాటాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మిక లోకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంపై దృష్టి సారించకపోవడం వల్ల సంక్షేమం అదుపు తప్పి ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుందని విమర్శించారు. కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించాలని చట్టంలో పేర్కొన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి పాలకులు, కార్పొరేట్ శక్తులు, ప్రయివేటు యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నాయని తెలిపారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాల వల్లే యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీపుకొచ్చారని గుర్తుచేశారు. కార్మికుల పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని పోరాటం చేస్తూ ఉంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్బంధ విద్యను అమలు చేయకుండా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు అత్యాచారాలు పెరిగిపోయాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజా సమస్యలపై భవిష్యత్లో సమరశీల పోరాటాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. మహాసభలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, మున్సిపల్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు ఆంజనేయులు, శ్రీనివాసులు, పర్వతాలు, కందికొండ గీత, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.