Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్ధాంతాన్నే అమలు చేస్తున్న మోడీ
- జుట్టుపై తప్ప అన్నింటిపై పన్ను వేసిన ఘనుడు మోడీ
- బీజేపీ అరాచకాలను ప్రజలే అడ్డుకోవాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-మోత్కూరు
భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని, ఆ సిద్ధాంతాన్నే ప్రధాని మోడీ పకడ్బందీగా అమలు చేస్తున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. ఆదివారం యాదాద్రి భువనగిరిజిల్లా మోత్కూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పునరంకితం కావాలని, రాజ్యాంగ విలువలను కాపాడాలని, ప్రజలు తమ బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వహిస్తేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పిన మోడీ రాజ్యాంగ మౌలిక సూత్రాలైన నాలుగింటిని లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం, ఫెడరలిజాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని తొంగలోకి నెట్టిన బీజేపీ.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని రంగం మీదకు తెచ్చి అమలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడు అంటూ గాడ్సేకు గుడి కడుతున్నారని, ఇలాంటి విషయాలను ఎవరైనా అడిగితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జర్నలిస్టులను, అభ్యుదయ భావాలు కలిగిన మేధావులను ఇప్పటికే చాలా మందిని చంపేశారన్నారు. బ్రిటీష్ వాళ్లు ఉప్పుపై పన్ను వేస్తే గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసి దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమం చేశారని, కానీ ఇప్పుడు మోడీ జుట్టుపై తప్ప అన్నింటిపై జీఎస్టీ వేసినా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరం, అధికారం కోసం ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయని, పేదలకు ఉచిత పథకాలు ఎందుకని, వాటిని రద్దు చేయాలని మోడీ చెబుతున్నారన్నారు. పేదలకు అందే సబ్సిడీలు, రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, కల్యాణలక్ష్మి, పింఛన్లు రైతు బీమా, ఇండ్ల పథకాల వాటిని ఎత్తేయాలని కేంద్రం చెబుతున్నారన్నారు. రూ.12 లక్షల కోట్లను పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు మాఫీ చేసిన కేంద్రప్రభుత్వం పేదలపై మాత్రం గ్యాస్, డీజిల్, పెట్రోల్, ధరల భారం మోపి ఏడిపిస్తుందన్నారు. రాజ్యాంగ విలువలను వక్రీకరిస్తూ ధ్వంసం చేస్తున్న ప్రధాని మోడీ, బీజేపీ అరాచకాలను అర్థం చేసుకుని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య, సహాయ కార్యదర్శి బొల్లు యాదగిరి, పల్లెర్ల అంజయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పండు, జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్ ఉన్నారు.