Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవసరమైతే అవయవదానం కోసం హెలికాప్టర్ వినియోగిస్తాం :
మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ సికింద్రాబాద్
గాంధీ ఆస్పత్రిలో త్వరలోనే రూ. 35 కోట్లతో అవయవ మార్పిడి విభాగం ఏర్పాటు చేయబోతున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఆదివారం ఆర్గాన్ డొనేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి అవయవదానం చేసిన దాతలను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవయవదానం ప్రోత్సహించడంలో భాగంగా అవయవదానం చేసిన పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అవయవదానం చేయడంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందన్నారు. అవయవదానం కోసం అవసరమైతే హెలికాప్టర్ సైతం వినియోగిస్తామన్నారు. కావున మనిషి మరణించిన తర్వాత విలువైన అవయవాలు మట్టిలో కలవడం కన్నా దానం చేయడం ఎంతో మిన్న అని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత చేస్తున్న ప్రచార కార్యక్రమాల వల్ల అవయవదానాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదన్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు 1080 డొనేషన్లు జరిగాయని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే కాదు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఖరీదైన ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయన్నారు. నిమ్స్‌లో 351, ఉస్మానియాలో 71, గాంధీలో 11 మొత్తం 433 ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయని వివరించారు. ఇందులో అత్యధికంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు నిమ్స్‌లో జరిగాయని తెలిపారు. రూ. 10 లక్షల విలువ చేసే ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలను పేదలకు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చేరువ చేసిందన్నారు. దాంతో పాటు సర్జరీ చేసుకున్న వారికి జీవిత కాలం పాటు రూ10 వేలు విలువ చేసే ఇమ్యునోసప్రేషన్ మందులను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. ఇక మొత్తం 36 ప్రభుత్వ ఆస్పత్రులు జీవన్ దాన్లో రిజిస్ట్రర్ కాగా, నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయన్నారు. 2013లో జీవన్‌దాన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 1142 బ్రెయిన్ డెత్ డొనేషన్స్ జరిగాయని, మొత్తం 4316 ఆర్గాన్స్ సేకరించి, అవసరం ఉన్న వారికి అమర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేష్ రెడ్డి, గాంధీ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.