Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోగో ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ టెక్నాలజీ నిపుణులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సింగపూర్ వేదికగా వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలో 2023 ఏప్రిల్ నెలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ (డబ్ల్యూటీఐటీసీ) లోగోను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం టీహబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. సింగపూర్ వేదికగా ప్రపంచంలోని తెలంగాణ టెక్కీలు ఒకే వేదికపై రానున్న ఈ విశిష్ట సదస్సులో టెక్నాలజీ ఎక్సేంజ్ , ఇన్నోవేషన్స్‌పై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. టీటా దశాబ్ది వార్షికోత్సవాల్లో భాగంగా వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ (డబ్ల్యూటీఐటీసీ) నిర్వహణకు ముందుకొచ్చిన టీటా చొరవను ప్రశంసించిన మంత్రి కేటీఆర్ టీటా కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇన్నోవేటర్లు, పరిశోధకులుగా సేవలు అందించడం, కీలక ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాష్ట్ర ఐటీ రంగ నిపుణులను ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు డబ్ల్యూటీఐటీసీను టీటా రూపొందించింది. సింగపూర్ వేదికగా జరగనున్న ఈ కాన్ఫరెన్స్‌లో ప్రధానంగా టెక్నాలజీ ఎక్సేంజ్ జరుగనుంది. అగ్రిటెక్, ఫిన్ టెక్, ఎడ్యుటెక్, హెల్త్ టెక్ వంటి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. డ్రోన్ టెక్నాలజీ, ఏఐ, రోబోటిక్స్, మెషిన్‌లెర్నింగ్ వంటి అధునాతన టెక్నాలజీలు రాబోయే కాలంలో ఐటీ పరిశ్రమను మలుపు తిప్పే తీరుపై విశ్లేషించనున్నారు. టీటా దశాబ్ది వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన లోగోను నేడు టీ హబ్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ నిర్వహణ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో టీటా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలను కోరుకుంటున్నట్టు పేర్కొన్న మంత్రి కేటీఆర్ వాటికి ప్రభుత్వ మద్దతు ఉంటుందని తెలిపారు. వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ నిర్వహణ ద్వారా ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రయోజనం కలిగించే ఈ కాన్ఫరెన్స్‌లో తెలుగు టెకీలు పాల్గొనాలని పేర్కొన్నారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తల ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఐటీ నిపుణులు, ఆవిష్కర్తలు, పరిశోధకులతో సింగపూర్ కేంద్రంగా నిర్వహిస్తున్న వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడం సంతోషకరమని అన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, దేశ విదేశీ కంపెనీలు, స్టార్టప్‌లు, స్టూడెంట్ ఇన్నోవేటర్లు పాల్గొంటారని తెలిపారు. దీనికి ఎంట్రీల ఆహ్వానం ఇస్తున్నామని తెలిపారు. టీటా దశాబ్ది వార్షికోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న సింగపూర్ వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్‌తో పాటుగా ప్రతి రెండు సంవత్సరాలకోమారు ఒక్కో దేశంలో ఇలాంటి కాన్ఫరెన్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో టీటా రాష్ట్ర కార్యదర్శి వినరు తూము, టీటా సభ్యులు శ్రీనివాస్ మర్రి, శ్రావణి బాసరాజు, క్రాంతి, వైద్యనాథ్, తదితరులు పాల్గొన్నారు.